చింతమనేనిపై పోరుబాట: దీక్షను విరమించిన అబ్బయ్య చౌదరి

16 Sep, 2018 19:57 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అక్రమాలపై గళమెత్తుతూ వైఎస్సార్‌సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షను విరమించారు. ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, గన్నవరం కన్వీనర్ యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం సాయంత్రం నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్షను విరమింపజేశారు. చింతమనేని ఇసుక అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలనే డిమాండుతో కొఠారు అబ్బయ్య చౌదరి శనివారం నుంచి దీక్షకు దిగారు. దీక్ష విరమణ అనంతరం వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాయన్నపాలెం నుంచి గోపన్నపాలెం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చింతమనేని అక్రమాలపై విచారణ జరిపి.. ఆయనపై చట్టబద్ధమైన చర్యలు తీసుకునేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.

చింతమనేని అక్రమ మైనింగ్‌పై అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు.. ఇక నీ ఆగడాలను సాగనివ్వమంటూ నిరశన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యానికి తెరదించడంతోపాటు, చింతమనేని అక్రమ మైనింగ్‌ వ్యాపారాన్ని అడ్డుకోవాలని, తమపై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దెందులూరు మండలం గోపన్నపాలెంలో శనివారం ఈ దీక్ష చేపట్టారు.

మరిన్ని వార్తలు