‘ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసమే భేటీ.. ఏ పార్టీతో పొత్తులుండవు’

16 Jan, 2019 17:37 IST|Sakshi

దుష్ప్రచారాలు చేయడం టీడీపీ నేతలు మానుకోవాలి

షర్మిల వ్యక్తిత్వం దెబ్బతీసేందుకే టీడీపీ కుట్ర

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

సాక్షి, విజయవాడ : టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో కేవలం ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించే మాత్రమే చర్చించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ నేతలు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుది నీచమైన మనస్తత్వమని ఆరోపించారు. బుధవారం వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం దేశవ్యాప్తంగా అందరి నేతలతోనూ చర్చల్లో భాగంగానే వైఎస్‌ జగన్‌తో టీఆర్‌ఎస్‌ నేతలు కలిశారని స్పష్టం చేశారు. దీనిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని అంబటి ధ్వజమెత్తారు. 

సీట్ల కోసం పాకులాడే రకం కాదు..
‘చంద్రబాబులా మేము ఎవరికి కొమ్ము కాయం, లాలూచీలు ఉండవు, ఏ పార్టీతో పొత్తులుండవు. చంద్రబాబు కేసీఆర్‌ను అమరావతికి ఎందుకు పిలిచారు? కేసీఆర్‌ నిర్వహించిన యాగానికి చంద్రబాబు ఎందుకు వెళ్లారు?. మేము మీలా సీట్ల కోసం పాకులాడే రకం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. కేటీఆర్‌ మాతో ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చలు జరిపితే టీడీపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారు. హరికృష్ణ మృతదేహం పక్కన పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్‌తో చంద్రబాబు చర్చలు జరిపింది నిజమా? కాదా?.  టీఆర్‌ఎస్‌ ఛీ అన్న తర్వాత కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారు.

షర్మిల వ్యక్తిత్వం దెబ్బతీసేందుకు టీడీపీ కుట్ర
దివంగత నేత వైఎస్సార్‌ కుమార్తె షర్మిల వ్యక్తిత్వం దెబ్బతీయాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిలపై ఇలాంటి దుష్ప్రచారాలు రావటం బాధ కలిగిస్తోంది. చంద్రబాబు తన రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వం దెబ్బతీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుది నీచమైన స్వభావం.’అంటూ అంబటి రాంబాబు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.  

మరిన్ని వార్తలు