వంగవీటి రాధాకు అన్యాయం జరగదు: అంబటి

18 Sep, 2018 15:15 IST|Sakshi
అంబటి రాంబాబు

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వంగవీటి కుటుంబానికి అన్యాయం జరగదని, తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయని, ఆ పార్టీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తమ పార్టీ అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంగవీటి రాధాకు అన్యాయం చేయాలనే ఆలోచన తమ పార్టీకి లేదన్నారు. ఆయన గతంలో విజయవాడ ఈస్ట్‌ నుంచి గెలిచారని, అక్కడే ఆయన గెలుస్తారని అధిష్టానం భావిస్తుందన్నారు. మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానం కూడా ఆప్షన్‌ ఇచ్చిందన్నారు. దివంగతనేత రంగా అభిమానులు పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగంపై స్పందిస్తూ.. చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో కలిసుందాం అనుకున్నారని చెప్పారు. అలాంటప్పుడు టీఆర్‌ఎస్‌ వ్యవహారాల్లో ఎందుకు తలదూర్చారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత హైదరాబాద్‌ నుంచి ఎందుకు పారిపోయి వచ్చారని నిలదీశారు. ఈ కేసు తర్వాత చంద్రబాబు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఒక్కసారైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గతంలో రాష్ట్రానికి వస్తే నల్ల జెండాలతో నిరసన తెలిపిన టీడీపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు. చౌకబారు రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు. హోదా కోసం కర్నూల్‌ జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నా ఎందుకు స్పందించడంలేదని దుయ్యబట్టారు. ధర్మాబాద్‌ అరెస్ట్‌ వారెంట్‌పై నానా హడావుడి చేస్తున్నారని, మహారాష్ట్ర కోర్ట్‌ నోటీసులు ఇస్తే ఇక్కడ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు