‘దేశం’ నాయకుల రక్షణ కోసమే పొత్తు

4 Nov, 2018 13:33 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : టీడీపీని కాపాడేందుకే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో జతకట్టారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నిన్నా మొన్నటి దాకా కాంగ్రెస్‌ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న చంద్రబాబు ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పొత్తు దేశ రక్షణ కోసం కాదని దేశం పార్టీ( టీడీపీ) నాయకులను కాపాడేందుకు కాంగ్రెస్‌తో కలుస్తున్నారని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేకనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు.

వ్యవస్థలను నాశనం చేస్తున్న చంద్రబాబు.. వ్యవస్థలను గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అన్నారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని ప్రజల కోసం పోరాడమన్నారు. బీజేపీతో కలిసి టీడీపీ ఇబ్బందులకు గురి చేసినా ప్రత్యేక హోదా కోసం పోరాడమన్నారు. చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకుంటే హోదా సంజీవని అని పోరాటం చేసింది వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి అని గుర్తు చేశారు. సీబీఐ అంటే కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టీగేషన్‌ అని ఊదరగొట్టిన చంద్రబాబు.. సిగ్గులేకుండా ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అక్రమాలకు, మోసాలకు మూల్యం చెల్లించ తప్పదన్నారు. 

స్వతంత్ర దర్యాప్తుకు ఎందుకు ముందుకు రావడం లేదు
ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు దాడిని ఖండించకపోవడం దారుణమని బొత్స అన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు కలిసి ప్లాన్‌ చేశారు కాబట్టే వారు ఖండించలేదని ఆరోపించారు. నిందితుని కాల్‌డేటా బయటపడితే అసలు సూత్రధారులు ఎవరో బయటపడతారన్నారు. ఘటన జరిగిన అరగంటలోపే డీజీపీ ఎలా మాట్లాడారో ప్రజలు గమనించారన్నారు. దర్యాప్తును పక్కదారి పట్టించే విధంగా డీజీపీ మాట్లాడారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ హత్యాయత్నం కేసులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. వ్యవస్థలపై  తమకు నమ్మకం ఉందని, కానీ ప్రభుత్వంపై నమ్మకం లేదని బోత్స పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్న ఘటనపై థర్డ్ పార్టీచే విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు