'సీబీఐ చెప్పిందే చివరి నిర్ణయం కాదు'

2 Nov, 2019 14:13 IST|Sakshi

సి.రామచంద్రయ్య

సాక్షి, కడప : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలు అవివేకమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి పలుమార్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోలేదా అంటూ గుర్తుచేశారు. జగన్‌ నేరస్తుడు కాదని, ఆయనపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత వైఎస్‌ జగన్‌కు ఉండడంతో కోర్టుకు వెళ్లి అప్పీల్‌ చేసుకున్నారు. సీబీఐ చెప్పిందే చివరి నిర్ణయం కాదని ,  పైకోర్టులు ఇచ్చే తీర్పే అసలు నిర్ణయం అని వెల్లడించారు.

ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారన్న చింత లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో పెయిడ్‌ ఆర్టిస్ట్‌లను ఏర్పాటు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అనేకసార్లు మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయనకు చిల్లర పార్టీల మద్దతు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక అక్రమంగా తవ్వించినందుకు రూ.100 కోట్ల ఫెనాల్టీ వేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ప్రభుత్వం తప్పు చేస్తే అడిగే హక్కు ఎవరికైనా ఉందని, కానీ తప్పు చేయకుండానే తప్పుడు వార్తలు రాసే పత్రికలపై చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయిన ఘనత దేశ చరిత్రలో పవన్‌కల్యాణ్‌కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు తలపెట్టే కార్యక్రమాలను భుజానికెత్తుకునే పవన్‌కు జగన్‌ నైతికత గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు