‘టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే బాగుంటుంది’

16 Oct, 2019 14:26 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య ప్రశంసించారు. పెట్టుబడి సహాయంగా రైతు భరోసా డబ్బులను నేరుగా ఖాతాల్లోకి వేయడంతో రైతులంతా ఆనందంగా ఉన్నారని చెప్పారు. నిన్ననే ప్రారంభమైన రైతు భరోసా పథకంలో అవకతవకలు జరిగాయని టీడీపీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను నిలువునా ముంచిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కరువు వచ్చి రైతులు అల్లాడుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు..  ఇప్పుడు నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

2004లో దివంగత నేత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ను చంద్రబాబు వ్యతిరేకించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన చంద్రబాబుకు సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. గడువు కంటే ముందే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం జగన్‌ను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. నవరత్నాలను నవగ్రహాలు అని చంద్రబాబు అనడం సిగ్గు చేటన్నారు. గతంలో చేసిన అవినీతి, కుంభకోణం బయటపడుతుందనే మోదీ అంటే ద్వేషం లేదంటూ చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందితే జుట్టు.. అదకపోతే కాళ్లు పట్టుకునేవాడిలా చంద్రబాబు తయారయ్యాడని ఎద్దేవా చేశారు. మధ్యవర్తిత్వం కోసమే బ్రోకర్లను, బినామీలను బీజేపీలోకి పంపించాడని ఆరోపించారు. దీనికంటే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే బాగుంటుందని సూచించారు. చంద్రబాబును బీజేపీ దగ్గరకు తీసే అబాసుపాలు కావడం తప్పదని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా