పరిటాల రవికి భయపడి జేసీ ఊరు వదిలివెళ్లలేదా?

3 Jun, 2018 07:43 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ నేత పైలా నరసింహయ్య

పరిటాలకు భయపడి ఊరు వదిలివెళ్లలేదా జేసీ

విలేకరుల సమావేశంలో  పైలా నర్సింహయ్య ఫైర్‌ 

తాడిపత్రి : మూడు దశాబ్దాలుగా తాడిపత్రిలో రౌడీ రాజ్యం నెలకొందని, ఈ ప్రాంతాన్ని జేసీ సోదరులు సర్వనాశనం చేశారంటూ వైఎస్సార్‌ సీపీ నేత పైలా నరసింహయ్య విమర్శించారు. స్థానిక భగత్‌సింగ్‌ నగర్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ.. జేసీ సోదరుల నీచ సంస్కృతి జిల్లావాసులకు తెలిసిందేనన్నారు. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు వారు పెట్టింది పేరన్నారు. అందితే జట్టు... అందకపోతే కాళ్లు పట్టుకునే మనస్తత్వం ఉన్న జేసీ సోదరులు.. గ్రామాల్లో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోస్తూ వచ్చారన్నారు. వారి స్వార్థానికి ఎందరో బలిపశువులయ్యారన్నారు.

నేటికీ తాను పెద్ద రౌడీగా చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి..  పరిటాల రవి బతికున్నప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో కనీసం నామినేషన్‌ కూడా వేయకుండా ఊరు వదిలి వెళ్లిన విషయం నేటికీ తాడిపత్రి వాసులు మరిచిపోలేదన్నారు. వీరిని నమ్మి మోసపోగూడదంటూ ప్రస్తుత మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జిలాన్‌బాషా, కౌన్సిలర్‌ డీవీ కుమార్‌కి హితవు పలికారు.

జేసీ సోదరులను నమ్ముకున్న వారిలో పొట్టి రవి తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. వైఎస్సార్‌ సీపీ తాడిపత్రి సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జేసీ సోదరుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతూ వస్తోందన్నారు. దీనిని జీర్ణించుకోలేక వారు మతి చలించి మాట్లాడుతున్నారన్నారు. సమావేశంలో విజయమ్మ సేవా సమితి అధ్యక్షుడు సంపత్‌ కుమార్, బాలరాజు, నాయకులు బాణా నాగేశ్వరరెడ్డి, కంచెం రామోహ్మన్‌ రెడ్డి, పేరం అమర్‌నాథరెడ్డి, ప్రదీప్‌రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు