‘అప్పుడు కోడిగుడ్లు, టమోటాలు విసరలేదా బాబూ’

28 Feb, 2020 17:57 IST|Sakshi

1994 ఆగస్టు ఎపిసోడ్‌ను గుర్తు చేసిన దాడి వీరభద్ర రావు

ప్రజాగ్రహంతోనే బాబుకు నిన్న విశాఖలో చేదు అనుభవమని వ్యాఖ్య

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలను తెలివి తక్కువ యాత్రలుగా పరిగణిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్ర రావు అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా బాబును ప్రజలు ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు వైఖరి పట్ల విరక్తి చెందిన స్థానిక ప్రజలే ఆయనను అడ్డుకున్నారని తెలిపారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. 

‘రెండేళ్ల క్రితం ప్రతిపక్ష హోదాలో ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాండిల్ ర్యాలీకి వస్తే కనీసం ఎయిర్ పోర్టులోకి కూడా పోలీసులు అనుమతించలేదు. కానీ, నేడు పోలీసులు కొన్ని నిబంధనలు పెట్టి చంద్రబాబుకు అనుమతులిచ్చారు. పోలీసులు అనుమతులిచ్చినా ప్రజలు అంగీకరించొద్దా? ఓ వ్యక్తి కోసం పోలీసులు లాఠీఛార్జీ చేశారు. చంద్రబాబు పర్యటన కోసం షూట్ ఎట్‌ సైట్ చేయాలా? ఓ వైపు ఢిల్లీ అగ్నిగుండం అవుతుంటే, జాతీయ నేతగా చెప్పుకునే చంద్రబాబు వైఖరి ఇదేనా? రాజకీయ బాధ్యత గల వ్యక్తి విశాఖలో అరాచకం సృష్టించడాన్ని ఖండిస్తున్నాం’అన్నారు.

ఎన్టీఆర్‌కు అవమానం కళ్లారా చూశాను..
ఎక్కడేం జరిగినా కడప, పులివెందుల అని మాట్లాడ్డం చంద్రబాబుకు అలవాటు. కానీ, అక్కడి ప్రజలను రౌడీలుగా, గుండాలుగా పరిగణించి వారి మనోభావాలను కించపరుస్తున్నారు. 1994లో మీరు చేసిన పనేంటి?  ఎన్టీఆర్ వైస్రాయ్‌ హోటల్‌కు వచ్చినప్పుడు చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసరలేదా చంద్రబాబు? ఎన్టీఆర్ చేతులు అడ్డం పెట్టుకుని తనను తాను రక్షించుకోవడం ప్రత్యక్షంగా చూసాను. ఎన్టీఆర్‌ వెన్నుపోటుకు విశాఖ నుంచే ఎమ్మెల్యేలతో ఆయన పథక రచన చేశారు. రాజకీయాల కోసం ఎంతటి స్థాయికయినా బాబు దిగజారుతారు. చంద్రబాబు మాటలతో ఉత్తరాంధ్ర ప్రజలు బాధపడుతున్నారు. 1994 ఆగస్టు ఎపిసోడ్‌పై సీఎం వైఎస్ జగన్ జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ కోరుతున్నా’అని వీరభద్ర రావు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు