‘టీడీపీ అధ్యక్షుడిగా బాబు ఉంటారో ఉండరో’

28 Oct, 2019 17:54 IST|Sakshi

సాక్షి, అమరావతి : వరదల వల్ల ఇసుక సరఫరా ఆలస్యమైతే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృత్రిమ కొరత సృష్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకుంటుంది అని ప్రశ్నించారు. ఇసుక కొరత అనేది తాత్కాలికం మాత్రమేనని స్పష్టం చేశారు. దోచుకోవడం, దాచుకోవడం చంద్రబాబుకే అలవాటని రమేశ్‌ చురకలంటించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘చంద్రబాబు అధికారంలో ఉండగా.. బాబు అక్రమ నివాసం పక్కన కోట్ల రూపాయల ఇసుకను తవ్వుకుపోయారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చంద్రబాబు ప్రభుత్వానికి రూ. 100 కోట్ల పెనాల్టీ విధించింది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి. రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు పాలనలో కరువుతో ప్రజలు వలసలు పోయారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వలసలు వెళ్లిన వారు తిరిగి వస్తున్నారు. 

రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్‌ కల్యాణ్‌కు సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదు. ప్రతిపక్ష నేత అసలు రాష్ట్రంలో ఉన్నాడా అని ప్రజలకు అనుమానం కలుగుతోంది. టీడీపీ రాష్ట్రంలో ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి. టీడీపీకి అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటారో ఉండరో తెలియదు. మా పార్టీలోకి ఎంతోమంది రావడానికి చూస్తున్నారు. ఫిరాయింపులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యతిరేకం. పార్టీలోకి రావాలనుకునే వారు పదవికి రాజీనామా చేసి రావాల్సిందే’ అని రమేశ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు