గుంటూరు అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ..!

15 Aug, 2018 15:01 IST|Sakshi

సీఐడీ విచారణ వల్ల ఏమీ జరగదు

సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే

వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేశ్‌రెడ్డి డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌ : గుంటూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కాసు మహేశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును తప్పించేందుకే అమాయకులపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

అక్రమ గనులను పరిశీలించేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు ప్రయోగించి అడ్డుకున్నారని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి 10 రోజులు గడువిచ్చామని, అప్పటికీ అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

అక్రమ గనుల వ్యవహారంలో సీఐడీ విచారణ వల్ల ఏమీ జరగదని, సీబీఐ విచారణ జరిపిస్తేనే నిజాలు వెలుగులోకి వస్తాయని, సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. అక్రమ మైనింగ్‌ జరుగుతున్న భూములను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోవాలన్నారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగితే.. బీజేపీ, కాంగ్రెస్‌, జనసేన పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

మరిన్ని వార్తలు