‘మొహం చెల్లదనే బాబు వారిని రప్పించారు’

11 Sep, 2019 12:54 IST|Sakshi

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కాసు, పిన్నెల్లి ధ్వజం

సాక్షి, గుంటూరు : పల్నాడు ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య సృష్టించి హింసను ప్రోత్సహించడమే చంద్రబాబు ఉద్దేశంగా ఉందని వైఎస్సార్‌సీపీ గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో పల్నాడులో ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతం గురించి బాబుకు ఏం తెలుసని అన్నారు. వైఎస్సార్‌ హయాంలోనే పల్నాడు అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. ఇసుక, మట్టి, మైనింగ్‌, గంజాయి సహా.. అసెంబ్లీ ఫర్నీచర్‌ను కూడా టీడీపీ నేతలు వదల్లేదని ఎద్దేవా చేశారు. గుంటూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కాసు మహేశ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నంబూరి శంకర్రావు, ఎంపీ కృష్ణదేవరాయలు  మీడియాతో బుధవారం మాట్లాడారు.

ప్రీగా వచ్చిందని ఫినాయిల్‌ కూడా వదలకుండా దోచుకున్నారని మహేశ్‌రెడ్డి చురకలంటించారు. పల్నాడు నాయకులు వస్తే మొహం చెల్లదని ఇతర జిల్లాల నేతల్ని తెచ్చారని ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌ పాలనలో పల్నాడు ప్రశాంతంగా ఉందని వెల్లడించారు. మూడేళ్లలో జమిలి ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ‘3 నెలల్లో ఎన్నికలు వచ్చినా మేం సిద్ధమే. గత ఎన్నికల్లో ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు’అన్నారు.

ఒక్కసారి కూడా రాలేదు.. ఇప్పుడేమో..
పల్నాడులో ఏం హింస జరుగుతోందో చర్చకు రావాలని వైఎస్సార్‌సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్‌ విసిరారు. గంతంలో చంద్రబాబు ఒక్కసారి కూడా ఈ ప్రాంతానికి రాలేదని, ఇప్పుడేమో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజల్ని కోరారు. టీడీపీ హయాంలో పల్నాడు ప్రాంతం వెనుకబడిందని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు అన్నారు. నేడు పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వెల్లడించారు. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో కూడా ప్రశాంత వాతావరణ నెలకొందని తెలిపారు.

అంబటి, గోపిరెడ్డిపై దాడులు చేశారు..
3 నెలల సీఎం జగన్‌ పరిపాలనలో అభివృద్ధి జరుగుతోందని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎంపీ కృష్ణదేవరాయలు చెప్పారు. గురజాల, సత్తెనపల్లి ప్రాంతాల్లో హింసను ప్రేరేపించింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై దాడులకు తెగబడ్డారని గుర్తు చేశారు. అయినా, లేని సంక్షోభాన్ని టీడీపీ నేతలు క్రియేట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గుంటూరు జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు మాతో పాటు ప్రతి గ్రామానికి రావాలి. ప్రతి గ్రామంలో జరిగిన అన్యాయాన్ని చూద్దాం. ఎవరు ఎవరిపై దాడి చేశారో ప్రజలే నిర్ణయిస్తారు’అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా