‘హోదా అంటే జైలుకే అన్న బాబును ఎవరూ నమ్మరు’

1 Feb, 2019 16:52 IST|Sakshi

 వైఎస్సార్‌​ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీర భద్రస్వామి

సాక్షి, విజయనగరం : ప్రత్యేక హోదా విషయంలో దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగిన చందంగా అధికార పార్టీ తీరు ఉందని వైఎస్సార్‌​ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీర భద్రస్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొన్నటి దాకా హోదా అంటే జైలుకే అన్న చంద్రబాబు వ్యాఖ్యలు ప్రజలు ఎన్నటికీ మరువరని వ్యాఖ్యానించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేర్చారా అని వైఎస్‌ జగన్ అసెంబ్లీలో నిలదీస్తే... మైకు కట్ చేయడం, ప్రత్యేక హోదాపై ప్రశ్నించినా పట్టించుకోకపోవడం వంటి విషయాలు అందరికీ గుర్తున్నాయన్నారు. ఎంపీల రాజీనామాలకు కలిసి రాకుండా ఇప్పుడు హోదా కోసమంటూ చంద్రబాబు తెగ బిల్డప్ ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసిన సీఎం అఖిల పక్షంలో ఏకాకిగా మిగిలిపోయారన్నారు.

ఆయన కొనసాగిస్తూ... ‘రాజధాని కోసం ప్రజల సొమ్ముతో మూడు భవనాలు కట్టించి.. ప్రజలను బస్సులో తీసుకువెళ్లి చూపించి సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. ఆర్ధిక వ్యవస్థను భ్రష్టు పట్టించారు. నిరుద్యోగ భృతి పేరిట మోసం చేశారు. ఇంటికో ఉద్యోగమన్నారు.. కానీ ఊరుకొకటి కూడా ఇవ్వలేదు. మూడు దపాలుగా మహిళలకు ఇచ్చిన ఎన్నికల తాయిలం రెండు వేల పెన్షన్ వైఎస్‌ జగన్ గతంలోనే ప్రకటించారు, దానిని బాబు అమలు చేసినా జగన్ సీఎం అయ్యాక మూడు వేలు చేస్తారు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం. మద్యపాన నిషేధం వంటి నవరత్నాలు అమలు చేస్తాం. ఎన్ని మిఠాయిలు ఇచ్చినా టీడీపీకి ప్రజలు ఓట్లేయరు. పిడికెడు మట్టి... చెంబుడు నీళ్లు కళ్లకు అద్దుకొని తీసుకున్నది మీరు కాదా బాబూ. నిజాలు రాస్తే సాక్షి ప్రతులను కాలుస్తున్నారు.... మీకు కూడా పత్రికలున్నాయని తెలుసుకోండి..‌ అవసరమైతే వాటిని తగలెడతాం’ అని  హెచ్చరించారు.

లోతైన విచారణ ఎన్‌ఐఏతోనే సాధ్యం
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కుట్రలో అసలు సూత్రధారులు త్వరలోనే బయటకు వస్తారని వీర భద్రస్వామి అన్నారు. ఈ కేసులో లోతైన విచారణ ఎన్‌ఐఏతోనే సాధ్యమన్నారు. ఎన్ఐఎకు కేసు అప్పగిస్తే భుజాలు తడుముకోవడం,  సీసీ కెమెరాలు కూడా నిలుపుదల చేయడం ప్రభుత్వ పెద్దల తీరుపై అనుమానాలు రేకెత్తిస్తుందన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు వైఎస్‌ జగన్ ఎటువంటి సంఘటనలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారన్నారు.

మరిన్ని వార్తలు