జేసీ.. నోరు అదుపులో పెట్టుకో

29 Dec, 2018 03:23 IST|Sakshi

ఇష్టమెచ్చినట్టు మాట్లాడితే సహించం..

వైఎస్‌ జగన్‌కు కులం రంగు పూస్తావా?

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌పై వైఎస్సార్‌సీపీ నేత కొరుముట్ల ఆగ్రహం  

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎంత మాత్రం సహించమని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు. అధికార దాహంతో కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధి చేస్తానని చెప్పి అధికారంలోకొచ్చిన టీడీపీ గత నాలుగేళ్లుగా స్వప్రయోజనాలే అజెండాగా పనిచేస్తోందని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ.. విభజించి పాలించే వైఖరిని చంద్రబాబు అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీల నుంచి లాక్కున్న 2 వేల ఎకరాలను.. విశాఖలోని సీఎం బావమరిది బాలకృష్ణ బంధువుకు కట్టబెట్టలేదా అని ప్రశ్నించారు. తిరుపతిలో ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన గల్లా జయదేవ్‌ కంపెనీకి, రాజంపేటలో కుసుమకుమారికి.. కోడూరులోనూ సొంత సామాజికవర్గానికే భూములు కేటాయించారని గుర్తు చేశారు.

జగ్గయ్యపేటలోనూ టీడీపీ మద్దతుదారులకే భూములిచ్చారన్నారు. జేసీ దివాకర్‌ అసభ్యంగా మాట్లాడుతుంటే.. ఇది మంచిపద్ధతి కాదని హెచ్చరించాల్సిన సీఎం మౌనం వహించి ఆయన్ని ప్రోత్సహించడం దారుణమన్నారు. దివాకర్‌రెడ్డి ఎప్పుడూ పిచ్చికుక్క తరహాలోనే మాట్లాడతాడన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్న ధర్మపోరాట దీక్షలను కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడానికే ఉపయోగించడం బాధాకరమన్నారు. తమ నేత వైఎస్‌ జగన్‌ను తిట్టడం కోసమే జిల్లాకొక జేసీ దివాకర్‌ లాంటి వాళ్లను చంద్రబాబు తయారుచేశారని మండిపడ్డారు. జేసీ సోదరులు మాట్లాడే భాష, చర్యలు ప్రజాస్వామ్యంలో ఎవరైనా హర్షించదగినవేనా అని ప్రశ్నించారు.

ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు. ఇది ప్రజాస్వామ్యమని.. నియంతలా వ్యవహరించడం కుదరదన్నారు. మళ్లీ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని.. తాము కూడా జేసీ దివాకర్‌రెడ్డిని అనగలమన్నారు. కానీ తమకు సంస్కారం అడ్డొస్తోందన్నారు. వైఎస్‌ జగన్‌కు కులం, మతం లేదని.. అందుకే ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం వరకు ప్రజలంతా ఆయన్ని అభిమానిస్తున్నారని చెప్పారు. అన్ని కులాలూ ఆయనవేనని.. అన్ని వర్గాలూ ఆయన్ని తమ వాడిగా భావిస్తున్నారన్నారు. చిల్లర రాజకీయాలకు స్వస్తి చెప్పాలని చంద్రబాబుకు సూచించారు. శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు బడుగు, బలహీనవర్గాలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు