సోనియా ఇటలీ దెయ్యం.. రాహుల్‌ ముద్దపప్పు

4 Nov, 2018 16:14 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ నేత కొట్టు సత్యనారాయణ

తాడేపల్లిగూడెం: కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఇటలీ దెయ్యం, రాహుల్‌ గాంధీని ముద్ధపప్పు అని గత ఎన్నికల సమయంలో తిట్టి, కాంగ్రెస్‌ పార్టీ ఈ దేశానికి అవసరం లేదన్న వ్యక్తి  చంద్రబాబు అని, మళ్లీ దేశ శ్రేయస్సు కోసం కాంగ్రెస్‌తో కలుస్తున్నాని చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత కొట్టు సత్యనారాయణ వ్యాక్యానించారు. ఈ రోజు తన రాజకీయ భవిష్యత్‌ కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు వెళ్లారని విమర్శించారు.

తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత జూన్‌లో గుంటూరులో జరిగిన రాహుల్‌ గాంధీ సభకు వెళ్లిన వాళ్లని రాష్ట్ర ద్రోహులు, దేశ ద్రోహులు అన్న చంద్రబాబు, ఏ మొహంతో రాహుల్‌ గాంధీని కలిశారని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన లాంటి రాజకీయ చీడపురుగు భారతదేశ చరిత్రలో ఎవరూ ఉండరని నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

రాజకీయ వ్యభిచారం చేస్తోన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల మనమంతా కూడా తలదించుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ చీడను త్వరగా తొలగించి ఏపీని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. తన కుట్రలన్నీ బయటపడిపోతున్నాయని, దాచుకున్న లక్షల కోట్ల రూపాయలు ఏమైపోతాయో అని, ఐటీ దాడులకు భయపడి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు