‘చంద్రబాబు.. రైతులు గగ్గోలు పెడుతున్నారు’

4 Jan, 2019 17:10 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు రుణమాఫీ అన్నారని, ఆయన చేసిన రుణమాఫీ రైతులు వడ్డీ కట్టుకోవడానికి కూడా సరిపోలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నాయకుడు మహీదర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘యువతకు నిరుద్యోగ భృతి 2000 ఇస్తానన్నావు.. నాలుగున్నర ఏళ్ళ తర్వాత 1000 అంటున్నావు. బాబు వస్తే జాబు వస్తుందన్నావు.. నువ్వు వచ్చిన తర్వాత అనేక మందిని తొలగించావు. యువత నిన్ను ఎందుకు నమ్మాలి?. డ్వాక్రా మహిళలకు  రుణమాఫీ అన్నావు. 10 వేలు ఇచ్చి రుణమాఫీ చేశావని అబద్దాలు చెబుతున్నావు.

డ్వాక్రా మహిళలు నిన్ను ఎలా నమ్మాలి బాబు?.  గడిచిన 4సంవత్సరాల 8 నెలల్లో కందుకూరు నియోజకవర్గ రైతులకు ముఖ్యమైన రాళ్లపాడుకు నీరందించే సోమశిల ఎడమ కాలువ పనులు 15 శాతం పూర్తి చేయడమే చేతకాలా.  రామాయపట్నం పోర్ట్ పూర్తి చేస్తావా? నిన్ను ఎలా నమ్మాలి?. నాలుగున్నర సంవత్సరాలుగా రామాయపట్నం పోర్టు గురించి పట్టించుకోని బాబు ఎన్నికల ముందు పోర్టుకు శంకుస్థాపన చేస్తానంటే నిన్ను ఎవరు నమ్ముతారు?.  పేపరు మిల్లు పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు. కందుకూరు నియోజకవర్గ గ్రామాలలో త్రాగు నీరు ఇబ్బందిగా ఉంటే పేపరు మిల్లుకు నీరెలా ఇస్తావ’’ని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు