‘అంత గోప్యత ఎందుకో’

13 Feb, 2019 16:27 IST|Sakshi
విజయనగరంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నేత మజ్జి శ్రీనివాస రావు

విజయనగరం జిల్లా: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆగమేఘాల మీద భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన చేయడానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తహతహలాడటం ఓట్ల కోసమేనని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. విజయనగరంలో మజ్జి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. భోగాపురంలో రైతులు జిల్లా అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చాలా త్యాగాలు చేశారని అన్నారు. టీడీపీ ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖా మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతి రాజు గతంలో భోగాపురం ఎయిర్‌పోర్టునకు నిర్మాణ సామర్థ్యం లేదని గతంలో చెప్పడం ప్రజలకు గుర్తుందని వ్యాక్యానించారు.

ప్రాజెక్టులకు అంచనాలు(ఎస్టిమేషన్‌లు) వేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, గతంలో కూడా తోటపల్లికి ఆఖరిలో రాయి వేసి వెళ్లిపోతే తర్వాత వచ్చిన వైఎస్సార్, బొత్స సత్యనారాయణలు  దానిని 90 శాతం పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భోగాపురం విషయంలో అంత గోప్యత ఎందుకు పాటిస్తున్నారో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఎనిమిది కంపెనీలు బిడ్స్‌ దాఖలు చేసినా, టెక్నికల్‌ క్వాలిఫికేషన్‌ లేని వారికి బిడ్స్‌ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ కంపెనీకి క్వాలిఫికేషన్‌ ఉందని శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నారని అడిగారు. ఎన్నికల హామీలు 5 ఏళ్లలో నెరవేర్చి ఎన్నికల్లో ఓట్లేయాలని అడగాల్సిన మీరు, పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఆఖరిలో డ్రామాలతో ఓట్లు అడగాలనుకోవడం దుష్ట సాంప్రదాయమన్నారు.

అవాస్తవ ప్రక్రియ ద్వారా మీరు(చంద్రబాబు) ముందుకు వెళ్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.  వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌ భోగాపురం రైతుల్లో భరోసా కల్పించారని అన్నారు. విమానాశ్రయానికి భూములు ఇచ్చేందుకు సహకరిస్తే భోగాపురం రైతులపై  కేసులు ఎత్తివేస్తామన్నారు..కానీ ఇంత వరకు ఎందుకు కేసులు ఎత్తివేయలేదని టీడీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కొవ్వాడ తరహాలో రైతులకు జరిపిన చెల్లింపులను భోగాపురం రైతులకు కూడా చెల్లించాలని అడిగినా ఇంకా ఎందుకు చెల్లించలేదని సూటిగా ప్రశ్నించారు. రైతుల పట్ల కక్షాపూరితమైన చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతోందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు