‘ఆదరణ పథకం కన్నా పబ్లిసిటి ఖర్చే ఎక్కువ’

13 Nov, 2018 14:37 IST|Sakshi

సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీసీ వర్గాలకు చేసిందేమి లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సినియర్‌ నేత మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదరణ పథకంతో చంద్రబాబు బీసీలకు ఏదో చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఆదరణ పథకం కింద టీడీపీ కార్యకర్తలకే పనిముట్లను ఇస్తున్నారని ఆరోపించారు. ఆదరణ పథకం కన్నా పబ్లిసిటి ఖర్చే ఎక్కువ ఉందని విమర్శించారు. చంద్రబాబు పథకాల వల్ల బాగుపడ్డ బీసీ కుటుంబాలు ఒక్కటి కూడా లేవని విమర్శించారు.

ఎన్నికల ముందు చంద్రబాబు మోస పూరిత ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలలో ఉన్న కొన్ని వర్గాలను ఎస్సీ, ఎస్టీలలో చేరుస్తానని ఇచ్చిన హామీని నేరవేర్చలేదన్నారు. మరికొన్ని వర్గాలను బీసీలలో చేరుస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలు వస్తున్నాయని మైనార్టీలకు, గిరిజనులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించారని విమర్శించారు. ఎన్నికల ముందు నాలుగు వలలు, మోకులు, నాలుగు కత్తెర్లు ఇచ్చి బీసీలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. విశాఖలో మత్స్యకారులను మోసం చేశారని, సెక్రటేరియట్‌లో నాయీబ్రాహ్మణులను చంద్రబాబు నాయుడు అవమానించారని గుర్తు చేశారు. బీసీ కుటుంబాల బాగు కోసం వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్‌ మెంట్‌ పథకాన్ని చంద్రబాబు నాశనం చేశారని ఆరోపించారు. బీసీలను మోసం చేస్తున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని మోపిదేవి వాఖ్యానించారు.

మరిన్ని వార్తలు