‘అన్నదాత సుఖీభవ అంటూ రైతు ఉసురు తీశారు’

19 Feb, 2019 15:22 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎమ్‌వీఎస్‌ నాగిరెడ్డి ఫైర్‌

సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ అంటూనే రైతు ఉసురు తీశారని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎమ్‌వీఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సభ కోసం ఓ రైతును అన్యాయంగా చంపిన ఘటనపై ఆయన స్పందించారు. మంగళవారం బాధిత కుటంబాన్ని పరామర్శించిన నాగిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం హెలిప్యాడ్‌ కోసం రైతు కోటయ్య పచ్చటి పొలాన్ని బలవంతంగా తీసుకున్నారని, తోటను మొత్తం చిందరవందగా తొక్కేసారన్నారు. దీన్ని ప్రశ్నించిన కోటయ్యను ఇష్టారీతిగా కొట్టారని, పోలీసుల దెబ్బలకే అతను చనిపోయాడని తెలిపారు. కోటయ్య లాంటి రైతు మరణంపై సీఎం చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడరని, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. సాక్షి లేకపోతే ఈ విషయం వెలుగు చూసేదా? అని నిలదీశారు. బీసీ కౌలు రైతు మీద జరిగిన దాడి ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, చంద్రబాబుకు అన్నదాత సుఖీభవ అనే అర్హత లేదన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పురుగుల మంది తాగినట్లు చిత్రీకరించారని,  ఈ కేసును హైకోర్టు సుమోటగా స్వీకరించి సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.కోటయ్య కుటంబానికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు.

చారిత్రక కొండవీడు కోట ఘాట్‌ రోడ్డు ప్రారంభోత్సవం సందర్బంగా సోమవారం యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలోని కొండకింద ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. చంద్రబాబు హెలికాప్టర్‌ దిగేందుకు వీలుగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ సమీపంలో గ్రామానికి చెందిన పిట్టల కోటేశ్వరరావు (40) సుమారు 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఇందులో బొప్పాయి, మునగ, కనకాబరం తోటలు సాగు చేస్తున్నాడు. సీఎం రాక నేపథ్యంలో పొలంలో కొంత భాగాన్ని దౌర్జన్యంగా పార్కింగ్‌ కోసం లాక్కున్నారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన రైతుపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. 

మరిన్ని వార్తలు