‘వివేకానందరెడ్డి మరణంపై లోకేశ్‌ వ్యాఖ్యలు దారుణం’

18 Mar, 2019 11:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి మరణంపై మంత్రి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలు దారుణమని ఆ పార్టీ నాయకులు పార్థసారథి అన్నారు. సోమవారం విజయవాడలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంతో తాము బాధలో ఉంటే.. సీఎం చంద్రబాబు నాయుడు వెటకారపు నవ్వులతో మాట్లాడారని గుర్తు చేశారు. చంద్రబాబుది నీచ మనస్తత్వం అని ఆయన విమర్శించారు. మానవత్వం ఉన్న మనషులెవరు ఇలా ప్రవర్తించరని వ్యాఖ్యానించారు. ఓటమి తప్పదనే భయంతో టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో హంతకులను పట్టుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎలా ఇరికించాలనే ఆలోచన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.(వివేకా మృతి విషయం తెలిసి ‘పరవశించా!’)

ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పార్థసారథి విమర్శించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య  కేసులో ప్రభుత్వ ప్రమేయం లేకుండా సీబీఐ విచారణ కోరాలని సవాలు విసిరారు. వైఎస్‌ జగన్‌ ఎప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని.. కార్యకర్తలను సంయమనం పాటించాలని కోరారని గర్తుచేశారు. చంద్రబాబు ఎన్నికల్లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రచార సభల్లో ఎదుటివారిపై దుష్ప్రచారమే చేయడమే తప్ప.. తన పరిపాలన ఎలా సాగిందో చెప్పుకోలేనీ దీన స్థితి చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు ఏం చేశారని ప్రజలు నిలదీస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు వైఎస్సార్‌ సీపీ పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన భూ కబ్జాలు ఆంద్రప్రదేశ్‌ చరిత్రలో లేవని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ ప్రశ్నలకు జవాబు చెప్పలేక బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళగిరిలో ప్రచారం చేస్తున్న నారా లోకేశ్‌ ఆదివారం రోడ్‌ షోలో మాట్లాడుతూ ‘పాపం వివేకానందరెడ్డి చనిపోయారు. ఆ విషయం తెలిసి పరవశించాం’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు