‘చెప్పేది చేయడు.. చేసేది చెప్పడు’

30 Dec, 2018 18:20 IST|Sakshi

విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికినా కేసీఆర్‌ కేసు పెట్టలేదని, ఇద్దరూ లోపల అండర్‌ స్టాండింగ్‌తో ఉన్నారని, బయటికి మాత్రమే ఆరోపణలు చేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు జూనియర్‌ రాహుల్‌ గాంధీ అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌, చంద్రబాబుని డర్టీ పొలిటీషియన్‌ అంటే కూడా చంద్రబాబు నేరుగా స్పందించలేదని గుర్తు చేశారు. చంద్రబాబు మొన్న మోదీతో, ఇప్పుడు రాహుల్‌తో..ఎప్పుడు ఎవరితో ఉంటారో అర్థం కావడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్‌ లెటర్‌ ఇస్తే ఆహ్వానించాలి కానీ ఇలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు హుందాతనం కోల్పోయారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులను చంద్రబాబు అసెంబ్లీలో పిల్లకుంకలు అన్న విషయాన్ని గుర్తు చేశారు. జేసీ దివాకర్‌ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతుంటే నువ్వెందుకు ముసిముసిగా నవ్వుకున్నావ్‌..అప్పుడు నీ సంస్కారం ఏమైందని బాబుని అడిగారు. ప్రత్యేక హోదా కోసం జగన్‌ అనేకసార్లు పోరాడితే వెకిలిగా మాట్లాడిన సంగతి గుర్తు లేదా అన్నారు.

హైకోర్టు విభజన కోసం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ ఎందుకు వేశారని ప్రశ్న సంధించారు. చంద్రబాబు లాంటి పచ్చి మోసకారి సీఎంగా ఉండటం రాష్ట్రానికి శని పట్టిందన్నారు. బాబు చేసిన మోసాలు ప్రజలందరికీ తెలుసునని, బాబు గురించి మాట్లాడాలంటేనే జుగుప్సాకరంగా ఉందని అన్నారు. చంద్రబాబూ నువ్వు ఎవరితోనైనా కలువు కానీ.. మేము మాత్రం ఒంటరిగా పోటీ చేసి 135 నుంచి 140 స్థానాలు తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన కోసం వాదించిన అ‍డ్వొకేట్‌కి రూ.66 లక్షల ఫీజు చెల్లించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.  చంద్రబాబువన్నీ డొంక తిరుగుడు మాటలే..చెప్పేది చేయడు, చేసేది చెప్పడని అన్నారు.

బాబులా నీతిమాలిన రాజకీయాలు ఎవరూ చేయరు: అప్పిరెడ్డి
చంద్రబాబులా నీతిమాలిన రాజకీయాలు ఎవరూ చేయరని అగ్రిగోల్డ్‌ బాధిత బాసట కమిటీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. 20 లక్షల మంది బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచన చంద్రబాబుకి లేదన్నారు. 240 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 143 మందికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు దోచుకోవాలన్నదే టీడీపీ నాయకుల లక్ష్యమని చెప్పారు. జనవరి 3న అన్ని జిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయాల ముందు ధర్నా అనగానే టీడీపీ నాయకులు హడావిడి చేస్తున్నారని తెలిపారు.

అగ్రిగోల్డ్‌ ఆస్తులకు విలువ ఉన్నా బాధితులకు చెల్లించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని సూటిగా ప్రశ్నించారు. తాము అడ్డుకుంటున్నామనేది వట్టి మాటని, బాధితులకు న్యాయం చేయాలన్నదే మా డిమాండ్‌ అని అప్పిరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జనవరి 3న అన్ని జిల్లాల్లో ధర్నా చేస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందిచకపోతే స్తంభింపచేస్తామని హెచ్చరించారు. బాధితులకు చివరి రూపాయి అందేవరకు మా పోరాటం కొనసాగుతుందని అప్పిరెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు