మోసకారి టీడీపీకి బుద్ధిచెబుదాం...

2 Feb, 2019 11:56 IST|Sakshi
రాయలసీమ బీసీ గర్జన సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్రంలో జంగాకృష్ణమూర్తి, వైఎస్‌ వివేకానందరెడ్డి, నారాయణస్వామి, చంద్రమౌళి తదితరులు

బీసీ గర్జనతో ప్రభుత్వానికి దిమ్మతిరగాలి

దేవుడు సాక్షిగా బీసీ మంత్రి కేఈ కృష్ణమూర్తిని అవమానించారు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైపే బీసీలు

ఓటు బ్యాంక్‌ రాజకీయాలను తరిమికొడతాం..

17న ఏలూరులో జరిగే బీసీ గర్జనలో మరిన్ని వరాలు

బీసీ గర్జన రాయలసీమ సన్నాహక సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు

అభివృద్ధిని విస్మరించి బీసీలను ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు మాత్రమే వాడుకుంటున్న మోసకారి టీడీపీకి ఓటుతో బుద్ధిచెబుదామని పలువురు బీసీ కులాల నాయకులు, వైఎస్సార్‌సీపీ బీసీ అ«ధ్యయన కమిటీ నేతలు స్పష్టం చేశారు. బీసీలు అంటే టీడీపీకి, చంద్రబాబుకు చిత్తశుద్ధి్ద లేదన్నారు. అందులో భాగంగానే బీసీ మంత్రి కేఈ     కృష్ణమూర్తిని అమరావతిలో దేవుడు సాక్షిగా అవమానించారని మండిపడ్డారు.

చిత్తూరు, తిరుపతి రూరల్‌: ఈ నెల 17న ఏలూరులో నిర్వహించే బీసీ గర్జన సమరభేరికి సమాయత్తం చేసేందుకు తిరుపతి తుమ్మలగుంటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం రాయలసీమ రీజియన్‌ బీసీ గర్జన సన్నాహక సమావేశం జరిగింది. వైఎస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ గర్జన సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు, నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధుల పాత్ర, బీసీల కోసం వైఎస్సార్‌సీపీ చేపట్టనున్న సంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం బీసీలను మోసగిస్తున్న తీరుపై మండిపడ్డారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కుతున్నారని విరుచుకుపడ్డారు. నవరత్నాల పథకాలతో బీసీ ల్లోని అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుం దని అభిప్రాయపడ్డారు. బీసీల సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని బీసీ అధ్యయన కమిటీ చైర్మన్‌ జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీల్లోని ప్రతి కులం అభివృద్ధి చెందాలనే ముందుచూపుతో 2017 నవంబర్‌లో బీసీ అ«ధ్యయన కమిటీని ఏర్పాటు చేశారన్నారు.

ఈ కమిటీ నివేదికలతో పాటు పాదయాత్రలో వచ్చిన సమస్యలను సైతం క్రోడీకరించి ప్రతి సమస్యకు పరిష్కారం చేసేలా ఈ నెల 17న జరిగే బీసీ గర్జన సభలోజగనన్న బీసీలకు వరాలు ప్రకటిస్తారని తెలిపారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికి వేదికగా బీసీ గర్జన సదస్సును నిర్వహిస్తున్నామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏలూరులో నిర్వహించే బీసీ గర్జన సభే పార్టీకి సంబంధించి మొదటి ఎన్నికల సన్నాహక సభగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి గ్రామం నుంచి ప్రాతినిథ్యం ఉండేలా నాయకులు చొరవ చూపాలని సూచించారు.
బీసీల సంక్షేమానికి నిరంతరం తపించిన నాయకుడు దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ఆయన కుమారుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు అండగా ఉంటారని స్పష్టం చేశారు.

అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో అభివృద్ధిని విస్మరించిన చంద్రబాబు, మోసపూరిత హామీలతో జనం ముందుకు రావాలని చేస్తున్న ప్రయత్నాలను పార్టీలకతీతంగా బీసీలు అందరూ తిప్పికొట్టాలని తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌ పిలుపునిచ్చారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా వేలాది కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రజా సంకల్పయాత్ర బీసీల భరోసాయాత్రగా జరిగిందని అనంతపురం పార్లమెంటరీ జిల్లా పార్టీ సమన్వయకర్త పీడీ రంగయ్య అన్నారు. బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా చంద్రబాబు అణిచివేస్తున్నారని గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆరోపించారు. కుప్పంలో గెలిచిన తర్వాత ఉన్నత విద్యావంతుడైన చంద్రమౌళిని మంత్రిని చేస్తామని ఇప్పటికే వైఎస్‌ జగనన్న ప్రకటించారని గుర్తు చేశారు. కుప్పంను కబళించిన అవినీతి తిమింగలం చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ కుప్పం సమన్వయకర్త చంద్రమౌళి ధ్వజమెత్తారు.

ఈసారి ఓటుతో బీసీలు చంద్రబాబును తరిమికొట్టడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి చెప్పారు. జగన్‌ వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి అమలు చేయని మోసకారి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ జిల్లా సమన్వయకర్త రామయ్య పిలుపునిచ్చారు. బీసీ గర్జనలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం జగనన్న ఊహించని వరాలను ప్రకటించనున్నారని అధ్యయన కమిటీ సభ్యుడు మీసాల రంగన్న తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సంజీవయ్య, మాజీ మంత్రి నర్సాగౌడ్, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాయలసీమ రీజియన్‌ సమన్వయకర్త పుల్లయ్య, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గంగుల బీజేంద్రనాథ్‌రెడ్డి, మేరుగ మురళి, కర్నాటి ప్రభాకర్, మిద్దెల హరి, వెంకటేష్, నర్సింహగౌడ్, సుధాకర్, చిన్నరాజు, బొమ్మగుంట రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు