మా అల్టిమేటంతో.. టీడీపీకి వణుకు: పేర్ని

17 Feb, 2018 02:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ ఎంపీలు రాజీనామాలకు కూడా సిద్ధపడటాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని వైఎస్సార్‌ సీపీ నేత పేర్ని వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించడంతో టీడీపీలో వణుకు మొదలైందన్నారు. అయోమయంతో తమ పార్టీపై దుష్ప్రచారానికి దిగుతున్నారని మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం వీరుడిలా పోరాడుతున్నారని చెప్పారు.

ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామాలకు సిద్ధపడి అల్టిమేటం ఇస్తూ జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని నాని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 19 అంశాలపై చంద్రబాబు ఎన్నిసార్లు మాట్లాడారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి ఆయన ఒక్కసారైనా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారా అని నిలదీశారు. ఇష్టానుసారం కథనాలు రాస్తోందంటూ ‘సాక్షి’మీడియాపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వచ్చిన వార్తలను నాని తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు వెలుగులోకి తెస్తున్న సాక్షిపై అక్కసు ఎందుకని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు