బాబూ.. మరి 80 శాతం ఓటింగ్‌ ఎలా జరిగింది?

13 Apr, 2019 14:13 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని ఫైర్‌

సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడు ఈవీఎంలు పనిచేయలేదని దిగజారి మాట్లాడుతున్నారని, మరి రాష్ట్రంలో 80 శాతం ఓటింగ్‌ ఎలా జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పేర్నీ వెంకట్రామయ్య(నాని) ప్రశ్నించారు. చంద్రబాబు ఆయన పుత్రరత్నం, భార్య, కోడలు అందరూ ఓటేసి చిరునవ్వులతో ప్రపంచానికి వేలు చూపారన్నారు. కానీ రోజు గడవగానే చంద్రబాబుకు ఏమైందని, మరి దిగజారి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. శనివారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. తనకు లొంగకపోవతే చంద్రబాబు ఎంతటివారిపైన అయినా విషం చిమ్ముతారని, ఇంతగా దిగజారిన రాజకీయనేతను ఎక్కడా చూడలేదన్నారు.

ఎంతసేపు ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను నిందిస్తూ ఓట్లేయమని అడగటం తప్పా ప్రజల కోసం నేను ఈ పనులు చేశానని.. నాకు ఓటేయమని అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. తాను చెబితే ఓట్లు వేయరని తెలుసుకున్న చంద్రబాబు ఫరూక్‌ అబ్దుల్లా, కేజ్రీవాల్‌, మమతాబెనర్జీ, దేవేగౌడలను తీసుకువచ్చి ఓట్లేయమని అడిగించుకున్నారని విమర్శించారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో డీజీపీనీ ఈసీ బదిలిచేస్తే ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. చంద్రబాబు చెప్పేది ప్రజలు నమ్మడం లేదని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తోందని, ఈవీఎంలు పనిచేయలేదని చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్షంలోనైనా చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు