అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా రిలే దీక్షలు

20 Dec, 2018 17:40 IST|Sakshi

ఏలూరు: రాష్ట్రంలో ఉన్న 19 లక్షల 20 వేల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉండేందుకు వైఎస్సార్‌సీపీ కమిటీ వేసిందని అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంఛార్జ్‌ రావూరి ప్రసాద రావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పార్టీ కార్యాలయంలో రావూరి విలేకరులతో మాట్లాడారు. ఒక్క పశ్చిమ గోదావరి  జిల్లాలోనే లక్షా 16 వేల మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వానికి అగ్రిగోల్డ్‌ ఆస్తులపై ఉన్న ఆసక్తి బాధితులకు న్యాయం చేసే విషయంలో లేదన్నారు. రాష్ట్రంలో అధికారికంగా 260 మంది అగ్రిగోల్డ్‌ బాధితులు మరణిస్తే 143 మందికి మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని ఆరోపించారు.

అసెంబ్లీ సాక్షిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు ప్రస్తుతం రూ.30 వేల కోట్ల ధర పలుకుతున్నా ప్రభుత్వం న్యాయం చేయడంలో అశ్రద్ధ వహిస్తోందని విమర్శించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అగ్రిగోల్డ్‌ బాధితుల ఆసరా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. అప్పటికీ స్పందించకపోతే 30వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలియజేస్తామన్నారు.

మరిన్ని వార్తలు