దుర్మార్గపు కుట్రల్లో బాబు దిట్ట 

22 Mar, 2019 01:39 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం

ఎన్నికలు దగ్గరపడేకొద్దీ కువిమర్శలకు దిగుతున్నారు

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడేకొద్దీ సీఎం చంద్రబాబు రాజకీయ కువిమర్శలకు దిగుతున్నారని, దుర్మార్గపు కుట్రలు చేయడంలో ఆయన దిట్ట అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. సజ్జల గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిర్మాణాత్మక, సహేతుకమైన విమర్శలు చేస్తే తగిన సమాధానాలివ్వొచ్చని, కానీ టీడీపీ నేతలకు హేతుబద్ధతగానీ, ఇంగితంగానీ లేవని.. హద్దూపద్దూ లేకుండా విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఎన్ని కువిమర్శలు చేస్తున్నా తాము సంయమనం పాటిస్తున్నామని, వ్యక్తిగత విమర్శల జోలికిపోకుండా టీడీపీ ప్రభుత్వ విధివిధానాలపైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నామని చెప్పారు. కానీ చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించేందుకు ఒక అంశం తరువాత మరో అంశాన్ని లేవదీస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేశారన్న స్కాం బయటపడితే తనను తాను రక్షించుకునేందుకు తెలంగాణ–ఆంధ్ర తగాదా అంటూ మాట్లాడారన్నారు. ఈ స్కామ్‌ను కొన్ని మీడియా సంస్థలు విశ్లేషిస్తున్న తరుణంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు అంతర్రాష్ట్రాల మధ్య నలుగుతున్న విషయాలను తెచ్చారన్నారు. ఆ తరువాత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఘటనపై ఫోకస్‌ చేసి ప్రజల దృష్టి మళ్లించే యత్నం చేశారన్నారు. తాజాగా మరో అంశానికి ప్రాణం పోశారని, 4 రోజుల్లో ఏపీలో ఐటీ దాడులు ముమ్మరంగా జరగబోతున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. 

చిలవలు పలువలు చేస్తున్నారు.. 
తాజాగా విజయవాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యను కట్‌ అండ్‌ పేస్ట్‌ చేసి చూపిస్తూ చిలువలు పలువలు చేస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. ఏకంగా అభ్యర్థినే మార్చాలని డిమాండ్‌ చేశారని, ఆ లెక్కన చంద్రబాబు ప్రత్యేక హోదాపై తీసుకున్న యూటర్న్‌లు, ఆయన మాట్లాడిన మాటలు తీరు చూస్తే ఆయన్ను ఎన్నిసార్లు సీఎం పదవి నుంచి తొలగించాలని ప్రశ్నించారు. ఏపీలో ఐటీ దాడులు జరుగుతాయని, అందుకు ప్రధాని నరేంద్ర మోదీ, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ కుట్రపన్నారని చంద్రబాబు గ్యాంగ్‌ మాట్లాడుతోందని.. అంటే జగన్‌కు, మోదీకి ఇంకేమీ పనుల్లేవా? అని ప్రశ్నించారు.  

అది బాబుకు వెన్నతో పెట్టిన విద్య.. 
దుర్మార్గ పథకాల్ని ఓపిగ్గా రచించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇందులో భాగమే ఆపరేషన్‌ గరుడని చెప్పారు. ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని, అల్లర్లు జరుగుతాయని, అనంతరం ఏపీలో రాష్ట్రపతి పాలనకు వీలుంటుందని ఆపరేషన్‌ గరుడలో శివాజీ జోస్యం చెప్పడాన్ని.. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు కూడా ఉటంకించడాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడూ ఇదే పునరావృతమవుతోందని, ఐటీ దాడులకు మోదీ కుట్ర పన్నారంటున్నారని, నాలుగు రోజుల తరువాత ఒకవేళ ఇది అమలైతే తాము ముందే చెప్పామని టీడీపీ నేతలంటారన్నారు. దాడులు జరుగుతాయని టీడీపీ నేతలు కేంద్రంలో ఉండే తమ వేగులద్వారా తెలుసుకుని ఇలాంటి ప్రచారం చేస్తూ ఉండొచ్చని అనుమానం వెలిబుచ్చారు. 

బ్యాంకు అకౌంట్లలో డబ్బు వేస్తున్నారు.. 
వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారని, ఆయా అకౌంట్లకు సేవామిత్రల ద్వారా రూ.5 వేలు చొప్పున డబ్బుపడేలా చేస్తున్నారని సజ్జల చెప్పారు. త్వరలో ఈ లావాదేవీల ద్వారా ఏఏ ఎకౌంట్లకు ఏ మేరకు నిధులు మళ్లించారనే సంగతి బయటపెడతామన్నారు.  మరో 18 రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయని, చంద్రబాబు దుశ్చర్యలను ప్రజలు గమనించాలని సజ్జల విజ్ఞప్తి చేశారు. పాలన పేరుతో అధికారపక్షం చేసిన అరాచకాలను ఎండగట్టాలన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని వెంటనే సాగనంపాలన్నారు. 

మరిన్ని వార్తలు