సర్వేల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం

26 Jan, 2019 12:19 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : చంద్రబాబు నాయుడు దోషిగా బోనులో నిలబడాల్సిన సమయం వచ్చింది.. అందుకే ఓట్ల తొలగింపు వంటి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టా రెడ్డి ధ్వజమెత్తారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. రాజ్యాంగ సూత్రాలను తుంగలో తొక్కి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన అక్రమాల వల్ల త్వరలోనే ఆయన బోనులో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు.

దీన్నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు ఏడాది నుంచి ఓట్ల తొలగింపు వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో చంద్రబాబు బూత్‌ స్థాయిలో కొన్ని ఓట్లను టార్గెట్‌ చేసి తొలగిస్తున్నాడని ఆరోపించారు. ఈ సర్వేల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రివర్స్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీదనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 55 లక్షల ఓట్లను తొలగించారని.. దీని గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. కత్తిరింపు సర్వేల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ఓటమి భయంతోనే చంద్రబాబు అత్యంత హీన స్థితిలోకి వెళ్లిపోయరంటూ విమర్శించారు. సర్వేల పేరుతో ఎవరు వచ్చినా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరించారు సజ్జల.

మరిన్ని వార్తలు