కరువు, చంద్రబాబు ఇద్దరు కవలలు

14 Feb, 2019 14:17 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి

సాక్షి, విజయవాడ: అన్నదాత సుఖీభవ అనే అర్హత టీడీపీ ప్రభుత్వానికి లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  రైతులను నిలువునా ముంచారని  దుయ్యబట్టారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల గురించి ఆలోచించి రెండేళ్ల కిందటే రైతు భరోసా పథకాన్ని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. ఓ వైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాదంటూనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 6 వేలతో కలిపి మొత్తం రూ. 10 వేలు ఇస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం రైతులను వంచన చేయడమే అని నాగిరెడ్డి మండిపడ్డారు.    

ఏపీని దుర్భిక్షాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ ఇప్పటివరకూ కాలేదని.. రైతుల బకాయిలూ ఇప్పటికీ చెల్లించలేదన్నారు. కరువు, చంద్రబాబు ఇద్దరూ కవల పిల్లలని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే తన పాలన చూసి ఓటెయ్యమని అడగగలరా అని ప్రశ్నించారు. రైతుల ఉసురుతో రానున్న ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని నాగిరెడ్డి జో​స్యం చెప్పారు. 

మరిన్ని వార్తలు