‘టీడీపీ నేతలు వీది రౌడీల్లా వ్యవహరిస్తున్నారు’

14 Feb, 2019 18:13 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ప్రజలను రక్షించాల్సిన పోలీసులు.. టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అసలు జిల్లాలో పోలీసు డిపార్ట్‌మెంట్‌ ఉందా అని ప్రశ్నించారు. టీపీపీ నాయకుల తొత్తులుగా పోలీసులు మారారని విమర్శించారు. పోలీసులు ఖాకీ చొక్కాలు తీసేసి.. పచ్చ చొక్కాలు వేసుకోవాలన్నారు. టీడీపీ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కోటబొమ్మాళి మండల వైఎస్సార్ సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతోనే కోటబొమ్మాళిలో తమ కార్యకర్తలపై దాడి జరిగిందని ఆరోపించారు. మంచి పాలన చేయమని ఎన్నుకుంటే.. టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

‘టీడీపీ నేతలకు అహం పెరిగింది. ప్రజలను ఫోన్లో బెదిరిస్తున్నారు. అధికారులను పిలిపించుకొని వార్నింగ్‌ ఇస్తున్నారు. దందాలు, మైన్స్‌, వైన్స్‌, సెటిల్‌మెంట్లు చేస్తూ రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. అమాయకులైన మా పార్టీ కుర్నాళ్లపై ఇనుప రాడ్లతో దాడులు చేస్తారా? కోటబొమ్మాళిలో మా పార్టీ కార్యాలయాన్ని తొలగించడానికి అచ్చెన్నాయుడు ఎవరు? రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదా? మంచిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలి కానీ బెదిరించి అధికారంలోకి రావాలనుకోవద్దు. పెన్షన్లు ఇచ్చాం, లోన్లు ఇచ్చామని బెదిరిస్తూ ఓట్లు వేయించుకోవాలని చూస్తారా? ప్రజల గమనిస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతల అరాచకాలు ఆపాలి లేకపోతే ప్రజలే తిరగబడతారు’ అని తమ్మినేని అన్నారు. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని అందుకే ప్రజలపై బెదిరింపులను దిగుతున్నారని విమర్శించారు. సర్వేల పేరుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుకూల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు