ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించండి

15 Dec, 2018 10:34 IST|Sakshi

స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శిని కోరిన డాక్టర్‌ తిప్పేస్వామి

సాక్షి, మడకశిర: ఈ నెల 20లోగా తనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శిని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి కోరారు. ఈ మేరకు ఫ్యాక్స్, ఈ–మెయిల్‌ చేసినట్లు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. తనను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను కూడా పంపానన్నారు. స్పీకర్‌ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని, కోర్టు ఉత్తర్వులను గౌరవించి తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీలో శుక్రవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని తిప్పేస్వామి కలిసి కోర్టులు ఇచ్చిన తీర్పు ప్రతులను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు.

సుప్రీం తీర్పును గౌరవించి రాజీనామా: ఈరన్న
సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఈరన్న తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా సమర్పించానన్నారు. తన రాజీనామాను స్పీకర్‌ ఆమోదించాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యేనే కానప్పుడు ఈరన్న పదవికి రాజీనామా చేయడం హాస్యాస్పదంగా ఉందని డాక్టర్‌ తిప్పేస్వామి అన్నారు. కోర్టుల తీర్పుల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేనే కాదన్నారు.

నేడు అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఈరన్న అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీ కార్యదర్శికి అందచేయనున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈరన్న.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఉన్న క్రిమినల్‌ కేసులతోపాటు కుటుంబసభ్యుల ప్రభుత్వ ఉద్యోగాల గురించి ప్రస్తావించలేదని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిప్పేస్వామి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన హైకోర్టు తిప్పేస్వామి వాదనను సమర్థిస్తూ.. ఈరన్న ఎన్నిక చెల్లదని ఇటీవల తీర్పునిచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఈరన్న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈరన్న తన ఎన్నికల అఫిడవిట్లో వ్యక్తిగత వివరాలు దాచిపెట్టారని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ధారించడమేగాక.. ఆయన ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పును సమర్థించింది. ఆ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగుతారని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో శనివారం వెలగపూడి అసెంబ్లీ కార్యాలయంలో కార్యదర్శిని వ్యక్తిగతంగా కూడా కలసి పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పు కాపీని అందచేయనున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, కోన రఘుపతి, తిప్పేస్వామిలతోపాటు పలువురు పార్టీ నేతలు అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్నారు.

ఈరన్న రాజీనామా వ్యూహం.. సుప్రీం తీర్పును తప్పించుకునేందుకేనా?
తన ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మడకశిర ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఈరన్న ఎన్నిక చెల్లదని, ఆయన తర్వాత స్థానంలోని  వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కొనసాగుతారని తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. తీర్పు ప్రకారం ఈరన్న ఎమ్మెల్యే పదవి రద్దయింది. కానీ ఆయన రద్దయిన ఎమ్మెల్యే పదవికి వ్యూహాత్మకంగా రాజీనామా చేశారు. శుక్రవారం వెలగపూడిలోని అసెంబ్లీకి వచ్చి కార్యదర్శి విజయరాజుకు తన రాజీనామా లేఖను ఇచ్చి వెళ్లిపోయారు. ఆ రాజీనామాను స్పీకర్‌ ఆమోదించాల్సి ఉంటుంది. స్పీకర్‌ ఆమోదించేవరకూ ఈరన్న ఎమ్మెల్యేగానే కొనసాగే అవకాశం ఉంటుంది.

స్పీకర్‌ ఏ విషయం తేల్చకుండా రాజీనామా లేఖను అలాగే రెండు, మూడు నెలలు కాలం గడిపితే ఈ అసెంబ్లీ సమయం ముగిసిపోతుంది. అప్పటివరకూ ఈరన్న ఎమ్మెల్యేగా కొనసాగవచ్చని టీడీపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈరన్నతో రాజీనామా చేయించనట్లు భావిస్తున్నారు. రాజీనామాకు ముందు గురువారం ఈరన్న సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ను కలిశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని ఈరన్నను ఎమ్మెల్యే పదవిలో కొనసాగించేందుకు చంద్రబాబు ఎత్తు వేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు