ఎమ్మెల్యేలను కొంటే ఎందుకు మాట్లాడలేదు: టీజేఆర్‌

6 Nov, 2018 13:58 IST|Sakshi

విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదుతో గుంటూరు పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు గురించి డీజీపీ, చంద్రబాబు, కేశినేని నాని, సోమిరెడ్డి, పరిటాల సునీత పలువిధాలుగా మాట్లాడారని, వీరిపై ఏ కేసులు పెట్టారని సూటిగా ప్రశ్నించారు. తాము పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఒక్క కేసు పెట్టలేదే అని పోలీసులనుద్దేశించి అడిగారు.

పెయిడ్‌ ఆర్టిస్ట్‌ శివాజీ గరుడ పురాణం గురించి చెబితే ఒక్క కేసు కూడా లేదే అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌పై ఆరోపణలు చేయించడానికి, కేసులు వేయించడానికి టీడీపీలో బీసీలు, దళిత నాయకులే దొరికారా అని ప్రశ్న లేవనెత్తారు. చంద్రబాబు ఇచ్చిన హమీలపై సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులకు మా పార్టీ నేతలు, కార్యకర్తలు వెనక్కు తగ్గరని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబూ నీది అసమర్థ దద్దమ్మ ప్రభుత్వమని తీవ్రంగా విమర్శించారు.

రాజన్న రాజ్యం ఒక్క జగనన్నకే సాధ్యమన్నారు. రాష్ట్రంలో దగాకోరు ప్రభుత్వం నడుస్తోందని దుయ్యబట్టారు. వైఎస్సార్‌ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని తెలిపారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి అంటే తమకు గౌరవం ఉందని, వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలని చంద్రబాబు వందల కోట్ల రూపాయలు పెట్టి కొంటే మీరు ఎందుకు మాట్లాడటం లేదని సూటిగా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు