‘కేవలం పునాది వేస్తారు.. నమ్మించేస్తారు’

27 Dec, 2018 11:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. అన్నింటికి కేవలం పునాది మాత్రమే వేసి బాబు ప్రజలను నమ్మిస్తారని అన్నారు. రాజధానిలో అన్నీ తాత్కాలిక భవనాలే అని మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద వైఎస్సార్‌సీపీ గురువారం చేపట్టిన ‘వంచనపై గర్జన దీక్ష’ లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, భారతీయ జనతాపార్టీలు ఆంధ్రప్రదేశ్‌ని ఏవిధంగా మోసం చేశారో ప్రజలకు తెలియజెప్పడానికే ‘వంచనపై గర్జన దీక్ష’ చేపట్టామని అన్నారు. విభజన హామీలను తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు.

బీజేపీతో ఉన్నప్పుడు కనీసం కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా బాబు మాట్లాడలేదని ధ్వజమెత్తారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించే ఉద్దేశం చంద్రబాబుకు లేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోనుందనే కాంగ్రెస్‌తో జతకట్టారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్లమెంటుకు వినిపించేందుకే..
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం పార్లమెంటుకు వినిపించాలనే వంచనపై గర్జన దీక్ష చేపట్టామని వైఎస్సార్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. హోదా కోసం మొదటినుంచీ పోరాడుతోంది తమ పార్టీయేనని అన్నారు. హోదా సాధనే లక్ష్యంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పనిచేస్తున్నారని తెలిపారు. తమ పార్టీకి చెందిన ఐదు మంది ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీయేనని చెప్పారు. ఏపీకీ అన్యాయం చేసిన వారిలో మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాన్‌ ముద్దాయిలని అన్నారు.

మరిన్ని వార్తలు