చంద్రబాబుకు భయమెందుకు?

5 Oct, 2018 13:54 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ 

సాక్షి, హైదరాబాద్‌ : సీఎం చంద్రబాబు నాయుడుకు దర్యాప్తు సంస్థలంటే భయమెందుకని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలతో డేంజర్‌ గేమ్‌ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఐటీ దాడులపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, పాకిస్తాన్‌ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నట్లు చంద్రబాబు ఆయన అనుకూల మీడియా ప్రచారం చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఐటీ దాడులను టీడీపీ వక్రీకరిస్తుందని మండిపడ్డారు. అసలు చంద్రబాబుపై ఐటీ సోదాలే జరగకూడదన్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌పై సోదాలు చేస్తే ఐటీ భేష్‌.. మీ పై చేస్తే మాత్రం ఐటీ పంజానా అని ప్రశ్నించారు.

చంద్రబాబుపై ఏదో జరుగుతుందనే సానుభూతి కోసం రాజకీయాలు చేస్తున్నారని, ఐటీ, సీబీఐ కాదు.. ఒక కానిస్టేబుల్‌ వచ్చినా ఆయన గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. కొన్ని ఛానళ్లు నారాయణ విద్యా సంస్థల్లో దాడులని ప్రచారం చేశాయని, చివరకు ఆ నారయణే వచ్చి ఎలాంటి దాడులు జరగలేదని చెప్పారన్నారు. దర్యాప్తు సంస్థలంటే చంద్రబాబుకు లెక్కలేదని, ఐటీ దాడులు అనగానే ముందుగానే సర్దుకుని గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు