నామినేషన్‌ వేసిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి

7 Mar, 2018 12:03 IST|Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి తాను అభిమానిని అని, వైఎస్‌ఆర్‌ పాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

‘ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాకు అత్యంత గౌరవాన్ని ఇచ్చారు. 40 ఏళ్లుగా వైఎస్‌ఆర్‌ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ కచ్చితంగా గెలుస్తుంది. ఏ పార్టీ వాళ్లు అయినా వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రను చూస్తే ఆయన ఎంత గొప్ప నాయకుడో తెలుస్తుంది. దురదృష్టవశాత్తు వైఎస్‌ఆర్‌ చనిపోయారు. కానీ ఈ రాష్ట్రానికి మంచి నాయకుడిని అందించారు. ఎన్నికష్టాలు ఎదురైనా జగన్‌ ప్రజల కోసం ధృడంగా నిలబడ్డారు. 2019లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు.’ అని అన్నారు.

మరిన్ని వార్తలు