రాజధానిలో అన్నీ తాత్కాలికమే: ఆనం

30 Nov, 2018 16:10 IST|Sakshi

కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం చేసిందని, సోనియా ఇటలీ దెయ్యం అని గత ఎన్నికల సమయంలో చెప్పి ఇప్పుడదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాకినాడలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆనం మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు కూడా మాయమాటలు చెబుతూ మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. చంద్రబాబుతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజధానిలో శాశ్వత భవనాలు ఉండవు..అన్నీ తాత్కాలికమేనని, తాత్కాలిక రాజధానితో రాజధాని లేకుండా బాబు తీర్చిదిద్దారని తీవ్రంగా మండిపడ్డారు.

కనీసం పోస్టల్‌ పిన్‌కోడ్‌ కూడా తెచ్చుకోలేని పరిస్థితికి బాబు తెచ్చారని విమర్శించారు. బీజేపీతో ఉన్నన్ని రోజులూ నవ నిర్మాణ దీక్షలు..ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి మరో పోరాటం అంటూ మోసానికి తెరలేపారని అన్నారు. బాబు విద్యార్ధి దశ నుంచే వంచన చేస్తూ వచ్చారని, రాజకీయాల్లో ఆనాడు కాంగ్రెస్‌ను వంచించారని వ్యాక్యానించారు. అధికారం ఇచ్చిన ముఖ్యమంత్రులను, చేరదీసి కుటుంబంలో సభ్యుడిగా చేసుకున్న ఎన్టీఆర్‌ను కూడా వంచించారని ఆరోపించారు. ఏపీని విభజించండి అభ్యంతరం లేదని కాంగ్రెస్‌కు లేఖ ఇచ్చి, మళ్లీ ప్రజల వద్దకు వచ్చి రెండు కళ్ల సిద్ధామంతమంటూ డ్రామాలాడారని తీవ్రంగా దుయ్యబట్టారు. 

వైఎస్‌ జగనే లక్ష్యంగా బాబు పాలన: మోపిదేవి

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డే లక్ష్యంగా చంద్రబాబు పాలన చేశారు తప్పితే పేద ప్రజల పరిస్థితి మెరుగుపడేందుకు ఏనాడూ చేయలేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అధోగతిపాలు చేశారని, ఏపీ పరువు ప్రతిష్టలను చంద్రబాబు దిగజార్చారని మండిపడ్డారు. రైతులు, యువత, మహిళలను ఏ మాత్రం కూడా చంద్రబాబు పట్టించుకోలేదని, బీజేపీతో కలిసున్నన్ని రోజులూ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనే తేలేదని అన్నారు.

హోదాను అవహేళన చేసింది బాబే: వర ప్రసాద్‌

ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదాపై పోరాడదామని  పిలుపునిచ్చినపుడు హోదాను చంద్రబాబు అవహేళన చేశారని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వర ప్రసాద్‌ గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ యూటర్న్‌ తీసుకుని ప్రత్యేక హోదా అంటున్నారని మండిపడ్డారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాం..రాజీనామాలు చేసి ఢిల్లీలో వారం రోజుల పాటు ఆమరణ దీక్షలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తుంది వైఎస్సార్‌సీపీయేనని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో అంశాలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు.

ఏపీ విభజనకు బాబే కారణం: రౌతు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్‌సీపీ నేత రౌతు సూర్యప్రకాశ రావు ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ బాధితుల డబ్బు కాజేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనేత వైఎస్సాఆర్‌ ఒక్కరేనని కొనియాడారు.

మరిన్ని వార్తలు