పవన్‌ తాను చిరంజీవి తమ్ముడినని చెప్పుకోలేక..

30 Nov, 2018 14:31 IST|Sakshi

కాకినాడ: జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ తాను మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడినని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు.శుక్రవారం కాకినాడలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ..ఓట్ల కోసమే తాను కానిస్టేబుల్‌ కుమారుడినని పవన్‌ చెప్పుకుంటున్నారని విమర్శించారు. చిరంజీవి పేరు చెప్పుకోలేని  పవన్‌ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రతి సభలోనూ కులాన్ని ప్రస్తావించే నాయకుడే పవన్‌ కల్యాణ్‌ అని తీవ్రంగా దుయ్యబట్టారు. పవన్‌ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా రావాలని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. వైఎస్‌ జగనే లక్ష్యంగా టీడీపీ, కాంగ్రెస్‌, జనసేనలు పని చేస్తున్నాయని, ప్రజలు జాగరూకతతో వచ్చే ఎన్నికల్లో ఓట్లేయాలని కోరారు.  తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది వైఎస్సార్‌, ఎన్టీఆర్‌లేనని చెప్పారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే తమ పప్పులుడకవని టీడీపీ, కాంగ్రెస్‌లతో పాటు జనసేనలు లోపాయకారిగా జతకట్టాయని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే హుందాగా నడుచుకుంటూ వెళ్లిన సంగతి గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌ పేరు వింటేనే చంద్రబాబు వణికిపోతున్నారని, దొంగకూటమిని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఒక్క అవకాశం వైఎస్‌ జగన్‌కు ఇస్తే తండ్రిని మించిన పాలన అందిస్తారని అన్నారు.

బాబు పాలనలో దళితులపై దాడులు: మేరుగ

చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగాయని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. వంచనపై గర్జన దీక్షలో మాట్లాడుతూ..దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి బాబు మర్చిపోయారని, వైఎస్సార్‌ హయాంలోనే దళితులకు లాభం జరిగిందని అన్నారు. వైఎస్‌ జగన్‌తోనే దళిత సంక్షేమం సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దళితులపై బాబుకు విశ్వాసం లేదని, దళిత కాలనీలకు బాబు వచ్చినప్పుడు నిలదీయాలని పిలుపునిచ్చారు. దేశంలోని కానీ, రాష్ట్రంలో కానీ చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని, మీడియాను అడ్డం పెట్టుకుని 2019లో బాబు ఎన్నికలకు వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హోదాపై అనేక యూటర్న్‌లు తీసుకున్నది చంద్రబాబేనని, హోదా ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై చంద్రబాబు కేసులు పెట్టించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి నిజంగా పోరాడుతున్నది వైఎస్‌ జగన్‌ మాత్రమేనని చెప్పారు.

నిరుద్యోగులకు బాబు రూ.2 లక్షల కోట్లు బాకీ: జక్కంపూడి

నాలుగేళ్ల పాలనలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు దొరికిన కాడికి దోచుకున్నారని వైఎస్సార్‌సీపీ నేత జక్కంపూడి రాజా ఆరోపించారు. అధికారంలోకి రాగానే కొన్ని వేల ఉద్యోగాలు పీకేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి అందరి ఉద్యోగాలు పీకేయించి లోకేష్‌ మాత్రం జాబు ఇప్పించారని తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు  ఇస్తామని చెప్పి మాట తప్పారని, నిరుద్యోగులకు రూ.2 లక్షల కోట్లు బాబు బాకీ పడ్డారని వెల్లడించారు.

మరిన్ని వార్తలు