పల్నాడులో వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టు

13 Nov, 2018 11:00 IST|Sakshi

గుంటూరు: పల్నాడులో వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇంటి పన్నుల పెంపు, వేసిన రోడ్లకే మళ్లీ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు మంగళవారం ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. దీంతో ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యక​ర్తలను ధర్నాకు వెళ్లనీయకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. గురజాల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాసు మహేశ్‌ రెడ్డిని గృహనిర్బంధం చేశారు.

పోలీసుల కన్నుగప్పి పిడుగురాళ్ల వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకున్న కాసు మహేశ్‌ను అక్కడ కూడా చుట్టుముట్టారు. వైఎస్సార్‌సీపీ అగ్రనేత అంబటి రాంబాబుని కూడా గుంటూరులో గృహనిర్బంధం చేశారు. పిడుగురాళ్ల నేతలు రామిరెడ్డి, రేపాల శ్రీనివాస్‌లతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్‌ చేసి రాజుపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకునేందుకు పిడుగురాళ్ల మున్సిపాలిటీ వద్దకు పోలీసులను భారీగా మోహరించారు.
 

కాసు మహేశ్‌ రెడ్డి అరెస్ట్‌

ధర్నాకు పిలుపునిచ్చిన గురజాల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాసు మహేశ్‌రెడ్డిని నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ను నిరసిస్తూ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల చర్యతో ఇద్దరు కార్యకర్తలకు గాయాలు కూడా అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిడుగురాళ్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు