టీడీపీ అక్రమాలకు లెక్కలేదు

14 Apr, 2019 10:40 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బాచిన చెంచు గరటయ్య

ఒంగోలు సిటీ: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా గురువారం అద్దంకి నియోజకవర్గంలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ  అసెంబ్లీ అభ్యర్థి బాచిన చెంచు గరటయ్య ఆరోపించారు. అధికారులను దగ్గర పెట్టుకొని మరీ టీడీపీ నాయకులు తెగపడ్డారని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఒంగోలులోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గరటయ్య మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలోని ఆరు పోలింగ్‌ కేంద్రాల్లో రీ–పోలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేశారు.

ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి రీ పోలింగ్‌ జరపాల్సిన పోలింగ్‌ కేంద్రాల వివరాలతో ఫిర్యాదు చేశామన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌తో పాటు అద్దంకి రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. వారు స్పందించి రీ–పోలింగ్‌ జరపని పక్షంలో కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తానని చెప్పారు. అద్దంకి నియోజకవర్గంలో 6, 7, 34, 43, 56, 57 పోలింగ్‌ కేంద్రాలలో అడ్డగోలుగా పోలింగ్‌ జరిగిందని, టీడీపీ నాయకులు రిగ్గింగ్‌ చేశారని ఆరోపించారు.
 
ముందు నుంచే చెబుతున్నా..
అద్దంకి నియోజకవర్గంలో సంతమాగులూరుతో పాటు కొన్ని సమస్యాత్మక కేంద్రాల్లో రిగ్గింగ్‌ సమస్యలు ఉన్నాయని అధికారులకు ముందు నుంచే చెబుతున్నానని గరటయ్య అన్నారు. అధికారులు ఎంత మాత్రం స్పందించకుండా పోలింగ్‌ రోజున టీడీపీ వారికి సహకరించారని ఆరోపించారు. సంతమాగులూరు తంగేడుపల్లి గ్రామంలో నెలకున్న పరిస్థితుల గురించి తాను నామినేషన్‌ వేసిన రోజు నుంచి చెప్పానని, రిటర్నింగ్‌ అధికారి, ఎస్పీని కలిసినట్లుగా తెలిపారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానన్నారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన చోటే దౌర్జాన్యాలు జరిగాయని వివరించారు.

వేమవరంలో రౌడీషీటర్లు రెచ్చిపోయారని, అక్కడ ఓటర్లకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. వేమవరంలో పోలింగ్‌ రోజున ఒక్క హోంగార్డు మాత్రమే విధుల్లో ఉన్నారన్నారు. అక్కడి నుంచి తంగేడుమల్లికి వెళితే పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ జరుగుతుందని తెలిపారు. పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ కెమెరా లేదని, పీవోను అడిగితే ఆయన స్పందించలేదని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లును లోనికి రానీయకుండా అడ్డుకున్నారన్నారు. చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంటు ప్రశ్నించినందుకు బయటకు వెళ్లకపోతే చంపేస్తామని టీడీపీ గూండాలు హెచ్చరించారని అన్నారు. పోలింగ్‌ అధికారులు, నియోజకవర్గంలోని అధికారులు, పోలీసు అధికారులు టీడీపీతో మిలాఖత్‌ అయ్యారని ఆరోపించారు.

ఇష్ట ప్రకారంగా పోలింగ్‌..
చనిపోయిన వారి ఓట్లను అనుమతించారని, ఓటర్‌ ఐడీ చూపించకపోయినా కేంద్రంలోకి అనుమతించారని గరటయ్య తెలిపారు. ఏ కార్డు లేని వారు ఏదో ఒక పేరు చెబితే ఆ పేరు మీద టీడీపీకి అనుకూలంగా రిగ్గింగ్‌ చేశారని ఆరోపించారు. ఇష్ట్రపకారం పోలింగ్‌ చేశారని తెలిపారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు. తంగేడుపల్లి 56 కేంద్రం, తంగేడుపల్లి ఎస్సీ కాలనీలోని పోలింగ్‌ కేంద్రంలో భారీగా రిగ్గింగ్‌ జరిగిందని వివరించారు. ఆ దరిదాపులకు వైఎస్సార్‌ సీపీ వారు వెళితే వారిని విచక్షణా రహితంగా కొట్టారని అన్నారు. జిల్లా పరిపాలనా యంత్రాంగం వైఫల్యం చెందిందన్నారు. కండ బలంతో రిగ్గింగ్‌ చేసుకున్నారని అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ సమయంలో ఒక్కరైనా స్పందించి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదన్నారు. సంతమాగులూరు మండలంలోని అడవిపాలెంలోనూ రిగ్గింగ్‌ జరిగిందని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లును బయటకు గెంటి వేశారన్నారు.
 
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది..

చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని గరటయ్య ఆరోపించారు. అందుకే ఎన్నికల్లో అకృత్యాలకు పాల్పడ్డారని అన్నారు. రౌడీయిజం, కండబలం ఉపయోగించారని అన్నారు. తాను ఓడిపోతానన్న బయంతో యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారని, ప్రలోభ పెట్టారని విమర్శించారు. అద్దంకిలో ఈ తరహా రాజకీయాలు జరుగుతాయని ముందుగానే అధికారులకు చెప్పినా అధికారులు  సీఎం చెప్పినట్లుగా విన్నారని విమర్శించారు. అద్దంకి నియోజకవర్గంలోని ఆరు కేంద్రాల్లో రీ–పోలింగ్‌ జరపకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు.

>
మరిన్ని వార్తలు