ఎస్సీ ఎస్టీ బిల్లుకూ అడ్డుపడతారా? 

22 Jan, 2020 04:31 IST|Sakshi

సభలో టీడీపీ వైఖరిపై వైఎస్సార్‌ సీపీ సభ్యుల మండిపాటు

దళితులపై ఇంత వ్యతిరేకతా?

వారిని అవమానించిన చరిత్ర చంద్రబాబుది

మహిళా మంత్రినీ మాట్లాడనివ్వరా?

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు బిల్లుపై చర్చ జరగకుండా ప్రతిపక్ష టీడీపీ అడుగడుగునా అడ్డుపడటం మంగళవారం శాసనసభలో తీవ్ర వాగ్యుద్ధానికి దారి తీసింది. టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలతో సభను అడ్డుకునేందుకు ప్రయత్నించగా దళితుల హక్కులను కాలరాసేలా వ్యవహరించడంపై వైఎస్సార్‌ సీపీ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్‌ అనుమతితో మంత్రి విశ్వరూప్‌ ఈ బిల్లును సభ ముందుంచారు. దీనిపై మాట్లాడేందుకు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు అవకాశం ఇచ్చారు. 

చంద్రబాబు దళిత ద్వేషి: వరప్రసాద్‌ 
బిల్లుపై చర్చను అడ్డుకుంటూ టీడీపీ ఆందోళనకు దిగడంపై ఎమ్మెల్యే వరప్రసాద్‌ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా? అని చులకనగా మాట్లాడిన వ్యక్తి రాజకీయాల్లో కొనసాగేందుకు అర్హుడేనా అని ప్రశ్నించారు. నవరత్నాలు పేదలకు ఎలా ఉపయోగపడుతున్నాయో టీడీపీ నేతలు ఆలోచన చేయాలన్నారు. పేదలు ఉన్నత చదువులు చదవకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. పసుపు కుంకుమ పేరుతో టీడీపీ ఖజానాను ఖాళీ చేసిందని మంత్రి అనిల్‌ అన్నారు. 

ఎస్సీలను తొలగించిన చరిత్ర బాబుది: పుష్ప శ్రీవాణి 
దళితులంటే టీడీపీకి ఎంత వ్యతిరేకత ఉందో బిల్లుపై చర్చను అడ్డుకోవడం ద్వారా తెలుస్తోందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చెప్పారు. మంత్రివర్గం నుంచి ఎస్సీలను తొలగించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో సగం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారని, ఎస్టీల్లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. కాగా, దళితుల సంక్షేమం టీడీపీకి పట్టదని ఎమ్మెల్యే నాగార్జున విమర్శించారు. 

మహిళా మంత్రులను అవమానిస్తున్నారు: రోజా 
ఎస్సీ ఎస్టీ బిల్లుపై మాట్లాడుతున్న మహిళా మంత్రిని అడ్డుకోవడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చంద్రబాబు ఎందుకు శాశ్వత కట్టడాలు చేపట్టలేదని ప్రశ్నించారు. తనను కేసీఆర్‌ పొగిడినట్లు చంద్రబాబు చెబుతున్నారని అయితే నిజానికి చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్‌ లేరని ఆయన అన్నారని తెలిపారు. మహిళా మంత్రులు మాట్లాడుతుంటే టీడీపీ నేతలు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు బతికే దాన్ని సామాజిక రాజధాని అంటారని, సామాజిక వర్గానికి ఒక రాజధాని కావాలని వీళ్లు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

రాజధాని ప్రాంతంలో ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులు భూములు కొన్నారని, నక్కా ఆనంద్‌బాబు ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. అనంతపురం నుంచి వచ్చి పయ్యావుల కేశవ్‌ భూములు కొన్నారని, కానీ యామినిబాల ఎందుకు కొనుగోలు చేయలేదని నిలదీశారు. బిల్లుకు అడ్డుపడుతున్న టీడీపీ తీరుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.కన్నబాబు, సుధాకర్‌బాబు, గొల్ల బాబూరావు, జోగారావు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  

మరిన్ని వార్తలు