వైఎస్సార్‌సీపీ బీసీ డిక్లరేషన్‌ సువర్ణ అధ్యాయం

17 Feb, 2019 05:39 IST|Sakshi
మీడియా సమావేశంలో పార్టీ నేతలు బొత్స, పెద్దిరెడ్డి, ఆళ్ల నాని, పార్థసారథి, జంగా తదితరులు

పార్టీ నేతలు బొత్స, పెద్దిరెడ్డి, పార్థసారథి 

బీసీల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయం

వైఎస్‌ జగన్‌తోనే బీసీల అభివృద్ధి సాధ్యమన్న నాయకులు

ఏలూరు టౌన్‌: ఏలూరులో ఆదివారం జరిగే బీసీ గర్జన మహాసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించే బీసీ డిక్లరేషన్‌ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రజాసంకల్ప పాదయాత్రలో బీసీ వర్గాల స్థితిగతులను స్వయంగా చూసి తెలుసుకున్నారని, అలాగే బీసీ అధ్యయన కమిటీ గ్రామగ్రామాన తిరిగి వారి సమస్యలు తెలుసుకుని నివేదికను పార్టీ జగన్‌కు అందజేసిందన్నారు. వీటి ఆధారంగా బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తారని వెల్లడించారు. ఏలూరులోని సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో హేలాపురి సిటీ టౌన్‌షిప్‌ పక్కనే నిర్వహిస్తున్న బీసీ గర్జన మహాసభ ఏర్పాట్లను పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, కొలుసు పార్థసారథి, జంగా కృష్ణమూర్తి, కారుమూరి నాగేశ్వరరావు, మేకా శేషుబాబు, ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, నర్సయ్య గౌడ్, చల్లపల్లి మోహనరావులతో కలిసి పరిశీలించారు. అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడుతూ నాడు వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు బీసీ వర్గాలకు ఎంతో ఉపయోగపడ్డాయని, ఆయన కంటే మిన్నగా జగన్‌ బీసీల అభివృద్ధికి పాటుపడతారన్నారు.  

బీసీలకు టీడీపీ చేసిందేమీ లేదు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్‌టీఆర్, చంద్రబాబు బీసీలకు పెద్దగా చేసిందేమీ లేదనీ, వారి ఓట్లతోనే అధికారం చెలాయించటం తప్ప వారి అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. జగన్‌ను ఆశీర్వదిస్తే బీసీలకు భవిష్యత్తులో మరింత మేలు జరుగుందని హామీ ఇచ్చారు. కొలుసు పార్థసారధి, జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ బీసీల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యయన కమిటీని ఏడాదిన్నర క్రితమే నియమించిందన్నారు. సంచార జాతులకు కూడా మేలు చేసేలా పార్టీ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు తాయిలాలు వేస్తున్నారన్నారు. బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని 9 జీవోలు జారీ చేశారన్నారు. వాటిలో దేనికైనా విధివిధానాలు, నిధులు కేటాయింపులున్నాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మాయలను ఈసారి బీసీలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సమావేశంలో పార్టీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు, పార్టీ నేతలు గుబ్బల తమ్మయ్య, మరడాని రంగారావు, గుడిదేశి శ్రీనివాసరావు, బొద్దాని శ్రీనివాస్, కర్నాటి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు