కోడెలపై సీఈఓకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

17 Apr, 2019 17:47 IST|Sakshi

అమరావతి: గుంటూరు జిల్లా ఇనిమెట్లలోని 160వ పోలింగ్‌ స్టేషన్‌లోనికి ప్రవేశించి టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్‌ చేసిన హైడ్రామాపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు.  ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్‌, సామినేని ఉదయభాను, ఎంవీఎస్‌ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ..ఇనిమెట్లలోని 160 పోలింగ్‌ స్టేషన్లో కోడెల శివ ప్రసాద్‌ కచ్చితంగా దౌర్జన్యానికి పాల్పడ్డారని, అందుకు ఆ సమయంలో తీసిన వీడియోలే సాక్ష్యమన్నారు.

దౌర్జన్యానికి సంబంధించి రాజుపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని పేర్కొన్నారు. దౌర్జన్యం చేసిన కోడెలతో కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాతే కోడెలపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడించారు. చట్ట విరుద్దంగా ప్రవర్తించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని సీఈఓ ద్వివేదీకి విన్నవించారు.

మరిన్ని వార్తలు