రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల దొంగ ఓట్లు: ఉమ్మారెడ్డి

21 Dec, 2018 15:10 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో ఓట్ల గల్లంతుపై విషయంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో టీడీపీ నేతలు ఉద్దేశ పూర్వకంగా ఓట్లు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని, టీడీపీ అనుకూల ఓట్లను ఉంచి, వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 52లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని అన్నారు.

గతంలో నరసరావుపేటలో 43 వేల ఓట్లు టీడీపీ నేతులు తొలగించారు. అధికార నేతల ఒత్తిడి తట్టుకోలేక ఎన్నికల అధికారులు సెలవులపై వెళ్లిపోతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని అన్నారు. కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ... గురజాల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిడి వల్లనే మాచవరం ఎమ్మార్వో సెలవుపై వెళ్లిపోయారని తెలిపారు. వచ్చే జనవరి 18 వరకు చూస్తామని, న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. గురజాల నియోజక వర్గం పిడుగు రాళ్ళలో కొత్తగా   8వేల దొంగ ఓట్లు చేర్పించారని  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు.

మరిన్ని వార్తలు