‘చంద్రబాబులోని రాక్షసత్వం బయటపడింది’

30 Oct, 2018 16:22 IST|Sakshi

సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై విచారణ పారదర్శకంగా జరగడం లేదని ఆ పార్టీ కర్నూలు జిల్లా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వైఎస్సార్‌ సీపీ కర్నూలు జిల్లా కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు చూస్తే.. దీనికి వారే ప్లాన్‌ చేసినట్టు స్పష్టం అవుతోందన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కూడా స్పందించని చంద్రబాబులోని రాక్షసత్వం ఇప్పుడు బయటపడిందని వ్యాఖ్యనించారు. టీడీపీ నేతల అవినీతి, అక్రమాలకు ఒక్క వైఎస్‌ జగన్‌ మాత్రమే అడ్డుగా ఉన్నారని భావించి.. పథకం ప్రకారం ఆయనను తుదముట్టించాలని చూశారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌పై ఆయన తల్లి, చెల్లి దాడి చేయించారని అనడానికి టీడీపీ నేతలకు సిగ్గు అనిపించడం లేదా అని మండిపడ్డారు. చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి వెనుక ఆయన భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌ ఉన్నారంటే ఒప్పుకుంటారా అని వారిని ప్రశ్నించారు.

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ.. కుట్రలతో పొడిచి చంపాలని చూసినా చిరునవ్వుతో హత్యాయత్నం నుంచి బయటపడిన నేత వైస్‌ జగన్‌ అని అన్నారు. వైఎస్‌ జగన్‌పై దాడి చేయడమే కాకుండా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి.. రాష్ట్రంలో అలజడి రేపాలని టీడీపీ నేతలు ప్రయత్నించారని ఆమె విమర్శించారు. అలాగే ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ.. నిష్పాక్షపాతంగా విచారణ జరగాలంటే స్వతంత్ర విచారణ సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్ జగన్‌కు రాష్ట్రంలో సరైన భద్రత లేదని.. ఆయనకు భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని హఫీజ్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు.

మరిన్ని వార్తలు