దళిత ద్రోహి చంద్రబాబు

6 Dec, 2019 12:26 IST|Sakshi
తుళ్ళూరులో రాజధాని రైతులతో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీదేవి, చిత్రంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేష్‌ తదితరులు

పేద రైతులపై అడుగడుగునా వివక్ష...

బట్టబయలవుతున్న ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ అవినీతి

చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

తుళ్లూరురూరల్‌: అమరావతి పేరుతో చంద్రబాబునాయుడు భూములతో వ్యాపారం చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేశారని,  ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల రైతుల భూములను బలవంతంగా లాక్కోవడమే కాకుండా, ప్యాకేజీ విషయంలో కూడా  వివక్ష చూపించారని, దళిత ద్రోహి చంద్రబాబు అని వైఎస్సార్‌ సీçపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి ధ్వజమెత్తారు. తుళ్లూరు మండల కేంద్రంలో గురువారం రాజధాని రైతులు, రైతు కూలీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, స్థానిక శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి, పెడన శాసనసభ్యుడు జోగి రమేష్‌ పాల్గొన్నారు. తొలుత రాజధాని గ్రామాల్లోని రైతులు, రైతు కూలీలు తమ సమస్యలను ప్రజాప్రతినిధుల ఎదుట వ్యక్తపరచారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ చంద్రబాబు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌లో అవినీతి అంతా బట్టబయలు అవుతుందని, ఆయన త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుకు రాజధానిపై నిజంగా అంత శ్రద్ధ ఉంటే శాశ్వత భవనాలను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ప్రతి భవనం తాత్కాలికంగానే ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని నిలదీశారు.టీడీపీ అధికారంలో ఉండగా అమరావతికి ఎందుకు గజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని నిలదీశారు. రాజధానిలో సమావేశం నిర్వహించే ధైర్యం లేక విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని విమర్శించారు.అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 119 సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి పచ్చపార్టీకి, ఎల్లో మీడియాకు పక్షవాతం వచ్చిందని ఎద్దేవా చేశారు. 

తొలుత రైతుల సమస్యపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో రాజధానిలో పూర్తిగా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని, అందుకు పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రాజధాని దళిత ప్రజలు, రైతులు, కూలీల సమస్యలను రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో స్వయంగా తెలుసుకున్నామన్నారు. అందరికీ న్యాయం జరిగేలా రాజధాని నిర్మాణం చేపడతామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపించారు. అమరావతి పేరుతో తన సమీప బంధువులకు, తన పార్టీ నాయకులకు, తన దగ్గర పనిచేసే వారికి, భూములు రాయించి భూమాఫియా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అవినీతికి పాల్పడినందునే చంద్రబాబును రాజధాని ప్రజలు చీదరించుకున్న విషయం గమనించాలన్నారు.

అంటరానితనాన్నిప్రోత్సహించిన చంద్రబాబు  
దళిత హక్కులను కాలరాస్తూ చంద్రబాబు రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరుతో దళితుల పట్ల అంటరానితనాన్ని, వివక్షను  ప్రోత్సహించారు. రాజధాని పరిధిలోని దళిత రైతులు, ప్రజలు, కూలీలకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. అందుకే రాష్ట్రంలో దళితులు వైఎస్‌ జగన్‌  వెంట నడిచారు. –మేళం భాగ్యారావు, దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు

రాజధాని పేరుతో రూ.58 వేల కోట్లు దోచేశారు
రాజధాని భూములను టీడీపీ నేతలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. రైతుల వద్ద నుంచి బలవంతంగా లాక్కుని, రైతులను మభ్యపెట్టి మోసం చేశారు.ల్యాండ్‌ పూలింగ్‌ చట్టం అడ్డుపెట్టుకుని వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. రాజధాని పేరుతో భూములతో వ్యాపారం చేసి రూ.58 వేల కోట్లు దోచేశారు.      –మల్లెల శేషగిరిరావు, రాయపూడి

మరిన్ని వార్తలు