అబద్ధాలు, బుకాయింపులు బాబుకు అలవాటే

20 Nov, 2019 05:22 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న మంత్రులు కన్నబాబు, మోపిదేవి, శంకరనారాయణ

ప్రతిపక్ష నేతపై మంత్రులు కన్నబాబు, మోపిదేవి, శంకరనారాయణ ధ్వజం 

పంట మార్కెట్‌కు రాకముందే నష్టాన్ని ఎలా లెక్కగట్టారు?

సాక్షి, అమరావతి: మొక్కజొన్న, వేరు శనగకు మద్దతు ధర లేక రైతులు నష్టపో తున్నారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్లు చేయడాన్ని రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకట రమణారావు, శంకరనారాయణ తప్పుబట్టారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాటాడుతూ.. పచ్చి అబద్ధాలు, బుకాయింపులు, బురద చల్లడాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదని మండిపడ్డారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆయనకు ఎప్పుడూ ఏదో ఒక అసత్య అజెండా ఉండాలని ధ్వజమెత్తారు. ఇసుక, ఆంగ్ల మాధ్యమం అంశాలు ముగిసిపోవడంతో ఇప్పుడు కొత్తగా మార్కెట్‌ ధరలంటూ కొత్త పల్లవి అందుకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాబు నైజాన్ని ప్రజలు గమనించాలి 
చంద్రబాబు పునాదులు కదిలిపోతున్నా యని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తేల్చిచెప్పారు. అందుకే ఆయన అసత్యా లతో ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బాబు అసలు నైజాన్ని ప్రజలు గమనించా లని కోరారు. రైతులతో పాటు వ్యవ సాయ అనుబంధ రంగాలను, అన్ని వృత్తుల వారినీ ఆదుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న సీఎం జగన్‌పై విమర్శలు చేయడం దారుణమన్నారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించడంలో చంద్రబాబు దిట్టని మంత్రి శంకరనారాయణ ఎద్దేవా చేశారు. 

రైతులను ఆదుకున్నది జగనే.. 
ధరలు లేక మొక్కజొన్న, వేరుశనగ రైతులు రూ.వందల కోట్లు నష్టపోయారంటున్న చంద్రబాబు పంట మార్కెట్‌కు రాకముందే ఆయన ఏ లెక్కన ఈ నష్టాన్ని అంచనా వేశారో చెప్పాలని మంత్రి కన్నబాబు డిమాండ్‌ చేశారు. బట్ట కాల్చి ముఖాన వేస్తామంటే కుదరదని అన్నారు. చంద్రబాబు లాగా రైతులను మోసం చేయడం తమ ప్రభుత్వానికి చేతకాదని స్పష్టం చేశారు. ఈ నెల 28వ తేదీనాటికి మార్కెట్‌కు వేరుశనగ వస్తుందని అంచనా వేసి, మూడు రోజుల ముందే కొనుగోలు కేంద్రాలు తెరవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.3,000 కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కిందని అన్నారు. 

మరిన్ని వార్తలు