‘బాబు అవినీతిపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది’

14 Feb, 2020 14:22 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌/కర్నూలు/అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రతి పనిలో అవినీతి జరిగిందని విమర్శించారు. బాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో ప్రతి పనిలో చిన్నబాబుకు కమిషన్లు వెళ్ళేవని విమర్శించారు. చంద్రబాబు అవినీతిని ఐటీ అధికారులు నిగ్గు తేల్చారని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమే అని చెప్పడంతో అవినీతి చేసిన టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు.(చదవండి : చంద్రబాబు అవినీతి బట్టబయలు)

అవినీతికి చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ : గడికోట
ప్రభుత్వ చీప్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చంద్రబాబు మిగిలిపోతారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేయగల ఘనుడు చంద్రబాబు అని తెలిపారు. దేశ చరిత్రలో స్వాతంత్ర్యం తర్వాత ఇటువంటి భారీ స్కామ్‌ ఎక్కడా లేదన్నారు. చంద్రబాబు చేసిన అవినీతి బాగోతాన్ని ఐటీ అధికారులు బట్టబయలు చేశారని చెప్పారు. గతంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని గుర్తుచేశారు. బాబు అక్రమ ఆస్తులపై దర్యాప్తు సంస్థ నిఘా పెట్టాలని కోరారు. టీడీపీ హయాంలో రూ. 3లక్షల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ఈ అవినీతి బాగోతంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇవన్నీ తప్పుదోవ పట్టించేందుకు అమరావతి అంశంపై బాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. (చదవండి : బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు)

ఆ డైరీలో బాబు బాగోతం ఉంది : తోపుదుర్తి
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. అవినీతికి కేరాఫ్‌ చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో లభ్యమైన డైరీలో చంద్రబాబు బాగోతం ఉందన్నారు. పీఎస్‌ ఇంట్లోనే రూ. 2వేల కోట్ల లావాదేవీలు వెలుగు చూస్తే.. బాబు ఇంట్లో ఎంత ఉంటుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ బినామీ ఆస్తులపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారందరిపైనా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ పాలనలో చేసిన అప్పులు.. చంద్రబాబు అండ్‌ కో జేబుల్లో నింపుకున్నారని మండిపడ్డారు. 

విద్యావంతుల ద్వారా వాస్తవాలు తెలుసుకోవాలి : ఆమంచి
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. టీడీపీ ప్రజాధనాన్ని దోచుకునే ఓ సంస్థ అని విమర్శించారు. రాజధాని భూముల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. అచ్చెన్నాయుడు, బొండా ఉమాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఫోర్త్‌ ఎస్టేట్‌గా నిలువాల్సిన మీడియా విలువలను ఎల్లో మీడియా నాశనం చేసిందన్నారు. ఇంట్లో ఉన్న విద్యావంతులైన పిల్లల ద్వారా ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. తెలుగుదేశం డ్రామా కంపెనీ మూసివేసే టైమ్‌ వచ్చిందని అభిప్రాయపడ్డారు. 

బాబు అవినీతి మరోసారి రుజువైంది : బీవై రామయ్య
వైఎస్సార్‌సీపీ నేత బీవై రామయ్య మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి పరుడని ఆధారాలతోపాటు మరొక్కసారి రుజువైంది. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడని గుర్తుచేశాడు. వాటిపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఈ కేసు నుంచి చంద్రబాబు, లోకేశ్‌లు తప్పించుకోలేరని అన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ ఇళ్లపై కూడా దాడులు నిర్వహించి లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును బయటకు తీయాలని డిమాండ్‌ చేశారు.

చదవండి : లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది

చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో!

మరిన్ని వార్తలు