కాపులకు బాబు ద్రోహంపై నోరెత్తలేదేం?

29 Jun, 2020 03:40 IST|Sakshi
మాట్లాడుతున్న తోట త్రిమూర్తులు, ఆమంచి

పవన్‌పై వైఎస్సార్‌ సీపీ నేతలు తోట, ఆమంచి ధ్వజం

కాపుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం రూ.4,769 కోట్లకుపైగా ఖర్చు చేసింది

ఐదేళ్లల్లో టీడీపీ వ్యయం చేసింది కేవలం రూ.1,874 కోట్లే

సాయం వివరాలు కళ్లెదుటే కనిపిస్తుంటే శ్వేతపత్రాలెందుకు?

సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ టీడీపీ అధినేత చంద్రబాబు బాణీలకు అనుగుణంగా నాట్యం చేస్తూ స్క్రిప్ట్‌ ప్రకారం వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ కాపు నేతలు తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్‌ ధ్వజమెత్తారు. ఆదివారం వారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. 

పవన్‌కు కనీస పరిజ్ఞానం లేదు..
► కాపుల సంక్షేమంపై ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వాలని పవన్‌ పేర్కొనటం విడ్డూరం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపుల సంక్షేమానికి రూ.4,769 కోట్లకుపైగా ఖర్చు చేసింది. కార్పొరేషన్‌ ద్వారా వివిధ పథకాలతో లబ్ధిదారుల ఖాతాలకే సొమ్ము జమచేసింది. దీనిపై పవన్‌కు కనీస పరిజ్ఞానం కూడా లేదు. 

మాటకు కట్టుబడి... 
► టీడీపీ ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని చెప్పి కాపుల కోసం ఖర్చు చేసింది రూ.1,874 కోట్లు మాత్రమే. చంద్రబాబు తొలి ఏడాది పాలనలో కాపులకు కేటాయించింది సున్నా. పవన్‌ కళ్యాణ్‌ అప్పుడెందుకు నోరెత్తలేదు? చంద్రబాబు పాలనలో కాపు కార్పొరేషన్‌ ద్వారా కేవలం 2,54,335 మంది లబ్ధి పొందితే సీఎం జగన్‌ ఏడాదిలోనే కాపు కార్పొరేషన్‌ ద్వారా 22,89,319 మందికి లబ్ధి చేకూర్చారు. 
► ఏటా రూ.2,000 కోట్లు కాపు కార్పొరేషన్‌ ద్వారా ఖర్చు చేస్తామన్న మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.3,392.43 కోట్లను కాపుల కోసం జగన్‌ ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.1,377 కోట్లకుపైగా ఖర్చు చేశారు. 

సాయం లెక్కలు ఇవిగో..
► వైఎస్సార్‌ కాపునేస్తం ద్వారా 2,35,873 మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.354 కోట్లను సీఎం జగన్‌ ఇటీవలే వారి ఖాతాలకు జమ చేశారు. అమ్మ ఒడి ద్వారా 3,81,185 మందికి రూ.571.78 కోట్లు, జగనన్న విద్యాదీవెన ద్వారా 1,23,257 మంది లబ్ధిదారులకు రూ.367.63 కోట్లు ప్రయోజనం చేకూర్చారు. జగనన్న వసతి దీవెన కింద 96,739 మందికి రూ.92.93 కోట్లు, వైఎస్సార్‌ రైతుభరోసా కింద 7,56,107 మందికి రూ.1,497.29 కోట్లు లబ్ధి కలిగింది. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 3,92,646 మందికి రూ.1125.88 కోట్లు, వైఎస్సార్‌ వాహనమిత్ర కింద 29,957 మందికి రూ.57.07 కోట్లు సాయం చేశారు. జగనన్న చేదోడు (దర్జీలకు) కింద 14,021 మందికి రూ.14.02 కోట్లు, వైఎస్సార్‌ నేతన్ననేస్తం కింద 2,577 మందికి రూ.6.18 కోట్లు, విదేశీ విద్యాదీవెన కింద 533 మందికి రూ.29.45 కోట్లు, వైఎస్సార్‌ జగనన్న ఇళ్లపట్టాల కోసం 2,56,424 మందికి రూ. 663.42 కోట్లు ఖర్చు చేశారు. ఇవన్నీ బహిరంగంగా కళ్లెదుటే కనిపిస్తుంటే శ్వేతపత్రం ఎందుకు?

బాబు డ్రామాలతో కాపులు నష్టపోయారు
► కాపు రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. సుప్రీం తీర్పు వల్ల 50% మించి రిజర్వేషన్లు పెంచే పరిస్థితి లేదని తెలిసీ చంద్రబాబు ఆడిన డ్రామాలతో కాపులు నష్టపోయారు. జగన్‌ ధైర్యంగా, నిజాయితీగా ఈ విషయంపై మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని కాపు సోదరులు గమనించాలి. బీసీల హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించటంపై తమ మద్దతు ఉంటుందని వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు