ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు

28 Jan, 2020 04:36 IST|Sakshi

ప్రజాతీర్పును గౌరవించని సభ అవసరమా?

గాంధీజీ, అంబేడ్కర్, నెహ్రూ, వంటి ప్రముఖులూ వ్యతిరేకించారు

ప్రపంచంలో కేవలం 68 దేశాల్లోనే ఎగువ సభలు ఉన్నాయి

మండలి రద్దుపై చర్చలో ధర్మాన ప్రసాదరావు

ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని అధికార పక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఓడిపోయిన నేతలకు శాసనమండలి పునరావాస కేంద్రంగా మారిందన్నారు. రాజకీయాల కోసం చట్టాలను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. శాసనమండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, దాడిశెట్టి రాజా, మంత్రి పేర్ని నాని, అధికార పక్ష ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, మేరుగ నాగార్జున, విడదల రజని, గుడివాడ అమర్నాథ్, కొలుసు పార్థసారథి తదితరులు మాట్లాడారు.ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. ప్రజలు ఆమోదించిన,ప్రభుత్వ నిర్ణయాలను మండలిలో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. అధికార పక్ష సభ్యులు ఏమన్నారంటే...

సాక్షి, అమరావతి: శాసనసభ తీసుకున్న ప్రజోపయోగ నిర్ణయాలను మండలి అడ్డుకుంటోందని.. అసలు అలాంటి సభ మనకు అవసరమా? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ అప్రజాస్వామికంగా, అభివృద్ధి నిరోధకంగా వ్యవహరిస్తున్న టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు శాసనమండలిని రద్దు చేయొద్దని చెప్పే అధికారం లేదని అన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ధర్మాన ప్రసంగించారు. గతంలో శాసనమండలిని రద్దు చేసినప్పుడు ధర్మవాక్యాలు వల్లించిన చంద్రబాబు ఈవేళ సభకు జవాబు చెప్పలేక పారిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో పలువురు ప్రముఖులు ఎగువ సభ రద్దు అవసరాన్ని నొక్కిచెప్పిన విషయాల్ని ఆయన తన ప్రసంగంలో వివరించారు. ధర్మాన ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

ప్రజోపయోగ నిర్ణయాల్ని అడ్డుకుంటారా?
ప్రపంచంలో 178 దేశాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలులో ఉంటే కేవలం 68 దేశాల్లో మాత్రమే మండలి వంటి ఎగువ సభలు ఉన్నాయి. చాలా దేశాలు రద్దు చేస్తున్నాయే తప్ప కొత్తగా తీసుకొస్తున్నవి లేవు. బ్రిటీష్‌ వాళ్లు.. వారి అవసరాల కోసం ప్రజల ఆకాంక్షలను పక్కనబెట్టి వీటిని ఏర్పాటు చేశారు.  అందుకే మహాత్మాగాంధీ మొదలు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, జవహర్‌లాల్‌ నెహ్రూ, గోపాలస్వామి అయ్యర్, ఎన్జీ రంగా లాంటి మహనీయులు వ్యతిరేకించారు. కొందర్ని మేనేజ్‌ చేయడానికి ఈ పెద్దల సభలు ఉపయోగపడతాయని ఆనాడే గాంధీ పసిగట్టారు. ప్రస్తుతం ఆ విషయం మనకు కరెక్ట్‌గా సరిపోయే సందర్భం. ఎన్నికల్లో గెలవలేక పరాజయం పొందినవారికి మండలి పునరావాస కేంద్రంగా మారింది. ఖజానాపై భారం పడుతుంది. ప్రజలచే తిరస్కరణకు గురైన వ్యక్తులు గ్యాలరీలలో కూర్చొని ప్రభావితం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే శాసనసభ ఔన్నత్యాన్ని పడగొట్టాలని ఎత్తుగడలు వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? సెలెక్ట్‌ కమిటీని పద్ధతి ప్రకారం వేయలేదు. ఆ సభలో ఉండే చైర్మన్‌ రూల్స్‌ వక్రీకరించి నిర్ణయం తీసుకున్నారు. సీఆర్‌డీఏ బిల్లును ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో టీడీపీ వాళ్లకు తెలియదా? 

మండలి అవసరం లేదని చంద్రబాబే చెప్పాడు
అమరావతి ప్రాంత ప్రజలే చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను ఓడిస్తే తిరిగి దొడ్డిదారిన తెచ్చి శాసనమండలిలో కూర్చోబెట్టి మంత్రిని చేశారు. ఆయన మండలిలో కూర్చొని ఇది తప్పు..అది తప్పని చెబుతున్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేసినట్టవుతుందా? కాదా? శాసనమండళ్లనే కాదు రాజ్యాంగపరమైన రాజ్యసభ రద్దుకు కూడా 1971, 72, 1975లలో ప్రయత్నాలు జరిగాయి. దేశ, ప్రజాక్షేమానికి భిన్నంగా వ్యవహరించినప్పుడు ఎవరో ఒక దేశ భక్తుడు ఈ ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ అవసరం వచ్చింది. మండలి అవసరం లేదని చంద్రబాబే అన్నాడు. అంతకుముందే మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి..గాంధీజీ చెప్పిన మార్గంలోనే నడుద్దాం. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నా’ అని ధర్మాన పేర్కొన్నారు. 

మండలి రద్దు 5 కోట్ల ప్రజల ఆకాంక్ష 
ప్రజా శ్రేయస్సు కోసం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే శాసనమండలి అడుగడుగునా అడ్డు తగులుతోంది. మండలిలో టీడీపీ సభ్యులు స్వార్థ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించి ఉమ్మడి రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోవడానికి చంద్రబాబు కారణమయ్యారు. సోనియాతో కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా వద్దంటూ ప్రత్యేక ప్యాకేజీ కోసం తాపత్రయపడ్డారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను పక్కనపెట్టి తన స్వార్థం కోసం అమరావతిని రాజధాని చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలను, పోలవరం ప్రాజెక్ట్‌ను మర్చిపోయారు. భవనాలు కట్టడమే అభివృద్ధి కాదు. దీనికి భిన్నంగా మా నాయకుడు వైఎస్‌ జగన్‌ 6 నెలల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి పాలనను ప్రజల చెంతకు చేరుస్తుంటే సహించలేకపోతున్నారు. అమరావతిలో 4,500 ఎకరాల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది. రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలే పరమావధిగా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెట్టిన ప్రతి బిల్లునూ తిప్పిపంపడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారు. శాసనమండలిని రద్దు చేయాలన్నది రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. మండలి రద్దు చాలా సమంజసం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే మండలి రద్దే మంచిది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నా.  
– ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని),ఉప ముఖ్యమంత్రి 

చంద్రబాబు పొలిటికల్‌ క్రిమినల్‌
పొలిటికల్‌ క్రిమినల్‌ ఎవరని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు చంద్రబాబే అని. చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టేలా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయన దొంగ రాజకీయాలు చేస్తున్నారు. గాయం చేసిన బాధ తెలిసిన వాడే సాయం చేయగలడన్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ద్వారా ప్రజల గాయాలను తెలుసుకుని వారు కోరుకున్న విధంగా చట్టాలు చేస్తుంటే చంద్రబాబు అడ్డు తగులుతున్నారు. ప్రజలు ఛీకొట్టిన నాయకుడు గ్యాలరీలో కూర్చుని ఆదేశిస్తే శాసనసభ ఆమోదించిన బిల్లును అవమానిస్తారా. తన దగుల్బాజీ రాజకీయాన్ని నిలదీస్తామనే చంద్రబాబు సభకు రాకుండా పారిపోయారు. పెద్దల సభకు వైఎస్‌ జగన్‌ అనుభవజ్ఞులైన నాయకులను పంపితే చంద్రబాబు తన ఇంట్లోని దద్దమ్మను పంపారు. అఖిల భారత మేధావుల సంఘానికి అధ్యక్షుడినని తనకు తానే స్వయంగా ప్రకటించుకున్న యనమలకు సింగపూర్‌ వెళ్లి జ్ఞానదంతం పీకించుకున్నా జ్ఞానం రాలేదు. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటే ముందు నోటీసు ఇవ్వాలని ఈ మేధావికి తెలియదా. ప్రజాభిప్రాయానికి, ప్రజాతీర్పుకు విలువ ఇవ్వని మండలి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. రాజ్యాంగాన్ని గౌరవించని పెద్దల సభకు శుభం కార్డు వేయాలి.  
– ఆర్‌కే రోజా, ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ 

ప్రజాస్వామ్య ‘స్పిరిట్‌’తో మండలి తెస్తే టీడీపీ ఆల్కహాల్‌గా మార్చేసింది 
ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం శాసనమండలిని చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాజకీయం చేయాలనుకుంటే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టేవారు. రాజకీయాలు ఫెయిర్‌గా ఉండాలనేది ముఖ్యమంత్రి అభిమతం. సీఎం వైఎస్‌ జగన్‌ అనుకుంటే ఆర్డినెన్స్‌ ద్వారా అయినా చట్టం తెచ్చేవారు కాదా? ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళ్తుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలి. ఇలాంటి మండలిని ఇంకా ఉండాలా? అని ఆలోచించాలి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలనే స్పిరిట్‌తో ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి మండలిని తీసుకొస్తే.. చంద్రబాబు ఆ మండలిని ఆల్కహాల్‌గా మార్చేశారు. దేవాలయం లాంటి పెద్దల సభను దెయ్యాల కొంపగా మార్చారు. 
– చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రభుత్వ విప్‌ 

 ప్రజాస్వామ్యవాదుల్ని ఆశ్చర్యపరిచింది 
శాసనమండలిలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సాగిన రాజకీయ క్రీడ ప్రజాస్వామ్య వాదుల్ని ఆశ్యర్యానికి గురి చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలన్నీ ఆయన ప్రయోజనాల కోసమే. శాసనమండలిలో చంద్రబాబు, టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఎండగట్టాల్సిందే. ఆయన పాలనలో దాడులు, అసమానతలు, ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు చూశాం. రాష్ట్ర విభజనకు ఆయన లేఖ ఇచ్చారు. హోదా విషయంలో అనేకసార్లు యూటర్న్‌ తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వికేంద్రీకరణ బిల్లు తెస్తే.. మండలిలో టీడీపీ సభ్యులు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసు. మండలి రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. 
– మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే 

ప్రజాభిమతాన్ని అడ్డుకోవడమేనా? 
చంద్రబాబు లాంటి వ్యక్తులకు రాజకీయ క్రీడగా మారిన శాసనమండలి, ప్రజా ప్రభుత్వం చేసిన చట్టాలను అడ్డుకోవడానికే పరిమితమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను మండలి అడ్డుకోవడం వెనుక చంద్రబాబు కుతంత్రాలున్నాయి. వ్యవస్థలన్నీ ఆధిపత్య వర్గం చేతిలో ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌ పాలనను వికేంద్రీకరించి, గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకు తెచ్చారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు పేదలను బానిసలను చేశాయి. విద్యుత్‌ సంస్కరణల పేరుతో చంద్రబాబు ఆ రంగాన్ని దోచుకుతిన్నారు. గ్రీన్‌ జోన్‌ పేరుతో అమరావతి రైతులను దగా చేసి, సింగపూర్‌ కంపెనీలకు మేలు చేకూర్చే ఒప్పందాలు చేసుకోవడమా చంద్రబాబు చేసిన రాజధాని అభివృద్ధి?. రైతులకు చేసిన పాపమే చంద్రబాబుకు శాపమైంది. అందుకే ఆయనకు 23 సీట్లు వచ్చాయి. కౌన్సిల్‌లో ఏదో జరిగిపోయిందని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. దేశ చరిత్రలోనే వైఎస్‌ జగన్‌ మాదిరిగా 51 శాతం ఓట్లతో గెలిచిన నాయకుడు లేడు. ఎన్టీఆర్‌కు 1983లో 43 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 51 శాతం ఓట్లతో 151 సీట్లు సాధించిన ఏకైక మగాడు వైఎస్‌ జగన్‌. 
– కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే 

ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసిన చరిత్ర యనమలది 
మండలిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి తెగబడ్డారు. మండలిలో టీడీపీ సభ్యులు సైంధవుల్లా వ్యవహరిస్తున్నారు. యనమల రామకృష్ణుడు వేసుకునే సూటు, బూటు కూడా ప్రభుత్వ సొమ్మే. ప్రభుత్వ సొమ్మును ఇంటి అద్దెలకు వాడుకున్న చరిత్ర యనమలది. ఇందుకు సంబంధించి జీవోలు ఉన్నాయి. రూ.లక్షల ప్రజాధనంతో దంత చికిత్సకు సింగపూర్‌ వెళ్లిన ఘనుడు యనమల. తన 39 ఏళ్ల రాజకీయ చరిత్రలో దుర్మార్గం తప్ప సొంత జిల్లాకు, తన నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఎన్టీఆర్‌కు పొడిచినట్లే ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. శాసనసభ్యులను ఆబోతులతో పోల్చిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నా.     
– దాడిశెట్టి రాజా, ప్రభుత్వ విప్‌ 

చంద్రబాబు అంటే వెన్నుపోటే గుర్తొస్తుంది 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను చూస్తే ఆయన ప్రవేశపెట్టిన అమ్మ ఒడి లాంటి సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబును చూస్తే వెన్నుపోటు కళ్లముందు కదలాడుతుంది. చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మేనిఫెస్టోను వందకు వంద శాతం నెరవేర్చేలా సీఎం వైఎస్‌ జగన్‌ పనిచేస్తున్నారు. ఐదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. ఒక్క ముస్లిం, మైనారిటీకి కూడా చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. మండలిపై కూడా చంద్రబాబు రెండు నాలుకల సిద్ధాంతాన్ని చూపించారు. ఈ ప్రభుత్వం ప్రజలకు అత్యంత జవాబుదారీతనంతో వ్యవహరిస్తోంది. 
– విడదల రజని, ఎమ్మెల్యే 

ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్ని గాయపరిచింది 
శాసనమండలిలో టీడీపీ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల మనసును గాయపరిచింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఉత్తరాంధ్రకు ఒక గుర్తింపు వస్తున్న తరుణంలో టీడీపీ నేతలు దానిని చెడగొట్టే ప్రయత్నం చేశారు. మండలి రద్దుపై శాసన సభలో ఎలా చర్చిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తునారు. సభలో చర్చించకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో చర్చించాలా?. పెద్దల సభలో పెద్దలు లేరు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు, అవినీతి పరులు, ఆర్థిక నేరస్తులు, కొబ్బరి చిప్పలు అమ్ముకునేవారే టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వికేంద్రీకరణ బిల్లుతో ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుంది. దానిని అడ్డుకుని చంద్రబాబు మూడు గ్రామాలకు హీరో కావొచ్చు. కానీ.. 13 జిల్లాలకు విలన్‌ అయ్యారు.  
– గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎమ్మెల్యే 

చంద్రబాబుది నక్షత్రకుడి పాత్ర  
రాయలసీమది ఘనమైన చరిత్ర. రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు మాత్రమే సీమలో ఉన్నాయని చిత్రీకరించి టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచే దుష్ప్రచారం మొదలు పెట్టింది. శ్రీమహావిష్ణువు స్వయంభువుగా వెలసిన తిరుపతి రాయలసీమలోనే ఉంది. తాళ్లపాక అన్నమాచార్యులు, వేమన, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి వారు రాయలసీమ వారు కాదా? ఎన్టీఆర్‌తో అద్భుతమైన హిట్‌ చిత్రాలు నిర్మించిన కేవీ రెడ్డి, బీఎన్‌ రెడ్డి వంటి వారు రాయలసీమ వారు కాదా?. రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షిస్తున్నారు. ఒకప్పుడు మండలిలో మహానుభావులు ఉంటే.. ఇప్పుడు కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ నిందితులు, ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవని వారు, భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో గెలవలేని వారు ఉన్నారు. జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ఆయన తాత రాజారెడ్డి గురించి ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావిస్తున్నారు. ‘రాజారెడ్డి లాంటి ఉత్తమోత్తమమైన వ్యక్తి చాలా అరుదుగా రాజకీయాల్లో ఉంటారు. ఆయనతో 23 ఏళ్లు సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా చెబుతున్నాను. కమ్యూనిస్టు నాయకుడు, ప్రముఖ పాత్రికేయుడు, గొప్ప దార్శనికుడు గజ్జెల మల్లారెడ్డికి అత్యంత ప్రాణసఖుడు రాజారెడ్డి. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి నీచంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది. – భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే 

జగన్‌ వల్ల నాకు శాప విముక్తి 
పొలిటికల్‌ ట్రాప్‌లో పడి ఎన్టీఆర్‌ అంతటి గొప్ప వ్యక్తికి వెన్నుపోటు పొడిచానని, అందుకు 15 సంవత్సరాలు రాజకీయంగా తెరమరుగయ్యానని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్ల తనకు శాపవిముక్తి జరిగిందన్నారు. గొప్ప వ్యక్తుల వల్లే శాప విముక్తి జరుగుతుందని పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు అంశాన్ని ప్రస్తావించగా స్పీకర్‌ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.  

విస్తృత చర్చ జరగాలి..: ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ సభాపతులు అనుసరించాల్సిన నిబంధనలు మార్చే అంశాన్ని పరిశీలించాలని  కోరారు. దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ.. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో జరిగిన స్పీకర్ల సమావేశాల్లో ఫిరాయింపుల నిరోధక చట్టాలపై మంచి చర్చలు జరిగాయన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి తమ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందేనని తమ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కచ్చితంగా చెబుతున్నారని తాను చాలా స్పీకర్ల సమావేశాల్లో చెప్పానని తెలిపారు. దీనిపై రాజ్యాంగ సమీక్ష జరగాలనే అభిప్రాయం వ్యక్తమైందన్నారు. బోస్‌ ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని, దానిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరముందని స్పీకర్‌ అన్నారు.  

అసెంబ్లీ ఆమోదిస్తే కౌన్సిల్‌ అడ్డుకోవడం ఏమిటి?
భావితరాల భవిష్యత్‌ కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేసే చట్టాలను అడ్డుకోవడానికే శాసనమండలిని చంద్రబాబు లాంటి వాళ్లు వాడుకుంటున్నారు. మహా యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లుగా జగన్‌ ప్రజా శ్రేయస్సు కోసం చేసే ప్రతి పనినీ చంద్రబాబు అడ్డుకుంటున్నారు. శాసనసభలో ఆమోదించిన చట్టానికి సూచనలు చేయాల్సిన బాధ్యత గల మండలి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అందుకే మండలిని రద్దు చేయాల్సిందే. ఇంగ్లిష్‌ మీడియం విద్య బిల్లు,  ఎస్సీ, ఎస్టీలకు విడివిడిగా కమిషన్‌ ఏర్పాటు చేసే చట్టాలను అసెంబ్లీ ఆమోదిస్తే కౌన్సిల్‌ అడ్డుకోవడం ఏమిటి. శాసనసభలో తాటకి మాదిరిగా చంద్రబాబు, కౌన్సిల్‌లో సుబాహు మాదిరిగా ఆయన కుమారుడు అభివృద్ధి యజ్ఞాన్ని అడ్డుకుంటున్నారు. కుట్రలు, కుతంత్రాలుతో నిండిన చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీ దుర్మార్గాలకు తెర తీస్తోంది. శాసన మండలి రద్దు గురించి చంద్రబాబు చెప్పే సుద్దులు విడ్డూరంగా ఉన్నాయి.

40 ఏళ్ల ఇండస్ట్రీ 2004లో మండలి పునరుద్ధరణపై వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను అందరూ గమనించాలి (అప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన వీడియో ప్రదర్శించారు). రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన మండలి రాష్ట్రానికి ఆర్థిక భారమన్న చంద్రబాబు ఇప్పుడు కావాలనడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టిన తరువాత మీరెవరు విడగొట్టేందుకు అని బస్సులో బయల్దేరారు. వాజ్‌పేయి ప్రభుత్వాన్ని మతతత్వ పార్టీ అని, తాను మద్దతు ఇవ్వనని చెప్పిన చంద్రబాబు తరువాత ఆ పార్టీతోనే జత కట్టారు. ప్రధాని మోదీ కాళ్లకు దండం పెట్టి బీజేపీతో అంటకాగారు. పత్రికారంగంలో దుర్మార్గ పోకడలు హేయం.  
– పేర్ని నాని, రవాణా, సమాచార శాఖ మంత్రి  

మరిన్ని వార్తలు