తొలి అడుగు!

27 May, 2019 13:26 IST|Sakshi
ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు, గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌ రావు, తిరుపతి ఎంపీ

లోక్‌సభ, శాసనసభలోకి ప్రవేశించనున్న ప్రజాప్రతినిధులు

ఆదాల కల నెరవేరిన వేళ

దుర్గాప్రసాద్‌రావుకు అందివచ్చిన అవకాశం

వెలగపల్లికి కాలం కలిసొచ్చింది

సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు నేతలు చట్టసభల్లో తొలి అడుగు వేయనున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో సీనియర్లుగా ఉండి గతంలో కూడా చట్టసభలకు ఎన్నికైన వీరు ఈ దఫా ఎన్నికల్లో లోక్‌సభ, శాసనసభకు ఎన్నికై ఆ సభల్లో తొలి అడుగులు వేయనుండడం విశేషం.

సాక్షి, నెల్లూరు: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్‌కు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఘనవిజయం సాధించిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి దశాబ్దపుకల నెరవేరింది. ఆయన లోక్‌సభలో తొలిసారిగా అడుగు పెడుతున్నాడు. జిల్లాలోని అల్లూరు మండలానికి చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి జాతీయ స్థాయిలో ప్రముఖ కాంట్రాక్టర్‌గా  ఉంటూ 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. అల్లూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారిగా శాసనసభకు ఎన్నిక కావడంతో పాటు మంత్రిగా పనిచేసే అవకాశం కూడా దక్కింది. అప్పట్లో జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల్లో టీడీపీ వెనుకబడడంతో అది సాకుగా చూపి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కుట్ర రాజకీయాలతో ఆదాల మంత్రి పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆపై 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆదాల విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్‌కు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్‌ బరిలో దిగి లక్షా 40వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆదాల దశాబ్దాల కాలంగా పార్లమెంట్‌కు వెళ్లాలనే ఆయన కోరిక ఈ ఎన్నికల్లో నెరవేరి లోకసభలో తొలి అడుగు వేయనున్నారు. ఆదాల ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారనే సెంటిమెంట్‌ కూడా ఉంది. ఎన్నికల నిర్వహణను ప్రణాళికాబద్ధంగా చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. దీంతో ఆయనకు విజయాలు సునాయాసంగా ఉంటాయి.

1985లో రాజకీయాల్లోకివచ్చిన దుర్గాప్రసాద్‌
వెంకటగిరికి చెందిన మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్‌రావు 1985లో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి గూడూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి శిష్యుడిగా పేరున్న బల్లి దుర్గాప్రసాద్‌రావు లాయర్‌ వృత్తిలో మంచి పేరు గడించారు. నేదురుమల్లి సిఫార్సుతో రాజకీయ ప్రవేశం చేసిన బల్లి 1989లో టీడీపీ తరపున పోటీ చేసి పట్రా ప్రకాశరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆపై 1994, 1999 ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగా రెండు సార్లు విజయం సాధించి ఆయన ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా చంద్రబాబు హయాంలో

పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ లభించలేదు. 2009లో మళ్లీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 2014లో ఆయన టీడీపీ టికెట్‌ ఆశించినా లభించకపోవడంతో రాజకీయంగా వెనుకబడిన ఆయనకు 2019 ఎన్నికల్లో అదృష్టం కలిసొచ్చింది. వైఎస్సార్‌సీపీ తిరుపతి పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో దిగి రెండు లక్షలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన లోక్‌సభకు ఇది తొలి అడుగు కావడం విశేషం.

వెలగపల్లికి అదృష్టం వరించింది
గూడూరు శాసనసభ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో దిగి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌పై 46వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించిన వెలగపల్లి వరప్రసాద్‌రావుకు శాసనసభకు ఇది తొలి అడుగు కావడం విశేషం. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన వెలగపల్లి వరప్రసాద్‌రావు 2009 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం చేసి ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున తిరుపతి పార్లమెంట్‌కు పోటీ చేసి విజయం సాధించారు. ఐదేళ్ల పాటు ఎంపీగా పనిచేసిన ఆయన 2019 ఎన్నికల్లో మాత్రం గూడూరు నుంచి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసి విజయం సాధించి తొలిసారి శాసనసభలో అడుగిడుతున్నారు.

మరిన్ని వార్తలు