‘హామీల అమలులో బాబు విఫలం’

2 Jan, 2019 15:54 IST|Sakshi

విజయవాడ: గత ఎన్నికల సమయంలో ప్రజలకు 600 హామీలిచ్చిన చంద్రబాబు ఈ ఐదేళ్ల కాలంలో వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్‌సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు తీవ్రంగా విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో వెల్లంపల్లి, మల్లాది విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని అడిగి దానిని మళ్లీ నీరుగార్చారని బాబుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు నిజాయతీగా ఉద్యమించింది వైఎస్‌ జగన్‌ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. యూటర్న్‌ బాబు అంటే చంద్రబాబేనని ఎద్దేవా చేశారు.

రుణాలు మాఫీ చేస్తానని డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నిరుద్యోగులను చంద్రబాబు మోసగించారని ఆరోపించారు.  అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షల ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చి వైఎస్‌ హయాంలో కట్టిన ఇళ్లనే చూపిస్తూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ జరగలేదని తెలిపారు. జన్మభూమి కార్యక్రమం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అసలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు అడిగే హక్కే లేదని తీవ్రంగా మండిపడ్డారు.

మరిన్ని వార్తలు