మడకశిక ఎమ్మెల్యేపై అనర్హత: అసెంబ్లీ కార్యదర్శిని వైఎస్సార్‌సీపీ నేతలు

15 Dec, 2018 18:36 IST|Sakshi

సాక్షి, మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నపై అనర్హత వేటు వేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు శనివారం ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యేపై వేటు వేసి.. ఆయన స్థానంలో మడకశిర నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగించాలని న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 20లోగా తనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శిని తిప్పేస్వామి కోరుతున్నారు.

శాసనసభ ఆవరణలో అసెంబ్లీ కార్యాదర్శి కార్యాలయానికి వెళ్లిన తిప్పేస్వామి వెంట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కోన రఘుపతి, ఆదిములపు సురేష్‌ తదితరులు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మడకశిర తదుపరి ఎమ్మెల్యేగా తనను గుర్తించాలని తిప్పేస్వామి అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. ఇప్పటికే స్పీకర్‌కు, అసెంబ్లీ కార్యదర్శికి తనను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను ఫ్యాక్స్, ఈ–మెయిల్‌ ద్వారా పంపానని ఆయన వెల్లడించారు.  స్పీకర్‌ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని, కోర్టు ఉత్తర్వులను గౌరవించి తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీలో శుక్రవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని తిప్పేస్వామి కలిసి కోర్టులు ఇచ్చిన తీర్పు ప్రతులను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు.

>
మరిన్ని వార్తలు